రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:05 PM
ప్రైవేటు స్కూల్ బస్సు, టీవీఎస్ మోపెడ్ వాహనం ఢీకొని రైతు మృతి చెందిన ఘటన మంగళవారం పెద్దదోర్నాలమండలంలోని పెద్దబొమ్మలాపురం బీఎంసీ కాలనీ వద్ద చోటుచేసుకుంది.
స్కూల్ బస్సు, మోపెడ్ వాహనం
ఢీకొనడంతో ఘటన
పెద్దదోర్నాల, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి) : ఈ ప్రమాదంలో గుమ్మా వెంకటేశ్వర్లు(55) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... దోర్నాలలోని ఓ ప్రైవేటు స్కూలు బస్సు పెద్దబొమ్మలాపురంలోని విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న క్రమంలో బీఎంసీ కాలనీ వద్దకు రాగానే అదే సమయంలో గుమ్మా వెంకటేశ్వర్లు సమీప పొలంలో జొన్న చొప్ప కోసుకుని మోపెడ్ వాహనంపై తరలిస్తూరోడ్డుపైకి వచ్చాడు. వేగం అదుపు తప్పి బస్సు, మోపెడ్ ఢీకొన్నాయి. దీంతో వెంకటేశ్వర్లు తారురోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ముటుకుల వీఆర్వో గుండెపోటుతో మృతి
పుల్లలచెరువు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ముటుకుల వీఆర్వోగా పనిచేస్తున్న ఉప్పుతోళ్ల కోటేశ్వరరావు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం శతకోడులోని స్వగృహంలో ఆయన మృతదేహానికి మండల టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఇన్‌చార్జి తహసీల్దారు కిషోర్, టీడీపీ మండల నాయకులు పయ్యావుల ప్రసాద్, కాకర్ల కోటయ్య, మేడికొండ లక్ష్మీనారాయణ, కె. కుమార్, ఈదెమ్మనాయుడులు నివాళులు అర్పించారు.
Updated Date - Dec 24 , 2024 | 11:05 PM