‘వెలిగొండ పూర్తయ్యిందంటూ ప్రజలను మభ్యపెట్టిన జగన్’
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:03 PM
ప్రాజెక్టు పూర్తికాక ముందే ప్రారంభోత్సవం అంటూ ఎన్నికల లబ్ధి కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రజలను మభ్యపెట్టేందుకు కపట నాటకం ఆడారని సీపీఎం నేతలు డీకేఎం రఫీ, సోమయ్య విమర్శించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమైనా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు.
టీడీపీ ప్రభుత్వమైనా ప్రాజెక్టును పూర్తి చేయాలి
కరపత్రాలను ఆవిష్కరించిన సీపీఎం నేతలు
మార్కాపురం వన్‌టౌన్, డిసెంబరు 24 ఆంధ్రజ్యోతి : ప్రాజెక్టు పూర్తికాక ముందే ప్రారంభోత్సవం అంటూ ఎన్నికల లబ్ధి కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రజలను మభ్యపెట్టేందుకు కపట నాటకం ఆడారని సీపీఎం నేతలు డీకేఎం రఫీ, సోమయ్య విమర్శించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమైనా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఈ విషయమై ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం స్థానిక కంభం రోడ్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సోమయ్య, రఫిలు లేఖలోని విషయాలను తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు ప్రాజెక్టును సందర్శించి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చేసిన ప్రకటన ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకా అని అనిపిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జంట సొరంగాలు జాతికి అంకితం అనే శిలాఫలకం చూసి ఆశ్చర్యపోయానని రాఘవులు లేఖ ద్వారా తెలియజేశారని చెప్పారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి వచ్చే వరద సమయానికైనా రిజర్వాయర్‌లో నీరు నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని కోరారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని నియమించాలన్నారు. నిర్వాసితులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలనాగయ్య, రాజు, నన్నేసా, నిర్వాసితుల సంఘం నాయకులు పుల్లారెడ్డి, వెంకట సుబ్బయ్య, రామకృష్ణారెడ్డి, లక్ష్మీరెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 11:03 PM