భూభారం
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:07 AM
జనంపై మరో భారం పడనుంది. సాఽధారణ రివిజన్‌లో భాగంగా భూముల విలువను ప్రభుత్వం పెంచబోతోంది. వచ్చేనెల 1 నుంచి అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని రివిజన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు.
పెరగనున్న భూముల విలువ
బహిరంగ మార్కెట్‌కు సమాంతరంగా నిర్ణయం
వచ్చేనెల 1 నుంచి అమలు
భారంకానున్న రిజిస్ట్రేషన్లు
పెంచవద్దంటున్న ప్రజాప్రతినిధులు
ఇప్పటికే పడిపోయిన రియల్ రంగం
సగానికి సగం తగ్గనున్న లావాదేవీలు
జనంపై మరో భారం పడనుంది. సాఽధారణ రివిజన్‌లో భాగంగా భూముల విలువను ప్రభుత్వం పెంచబోతోంది. వచ్చేనెల 1 నుంచి అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని రివిజన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇప్పటికే రెవెన్యూ అధికారుల నుంచి కమర్షియల్ భూములుగా మార్పుచేసిన వాటి వివరాలు తెప్పించుకొని సబ్‌రిజిస్ర్టార్లు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం వరకూ భూముల విలువ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రభావం రిజిస్ర్టేషన్ చార్జీలపై పడనుంది.
ఒంగోలు క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): భూముల విలువ పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రేటుకు సమాంతరంగా ఉండాలన్న ఆలోచనతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. అందుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న భూముల మార్కెట్ విలువల కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఈమేరకు 5శాతం నుంచి 20శాతం వరకు విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి భూముల విలువను రివిజన్ చేస్తారు. 2019లో సాధారణ రివిజన్ జరిగింది. 2020లో పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు 20శాతం పెంచారు. 2023లో స్పెషల్ రివిజన్ పేరుతో పట్టణ, మండల కేంద్రాలతోపాటు ముఖ్యమైన గ్రామాలలో కూడా భూముల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే కుదేలైన రియల్ రంగం
ఈ ఏడాది సాధారణ రివిజన్ పేరుతో భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. అయితే ప్రజాప్రతినిధుల నుంచి మాత్రం ధరలు పెంచవద్దని వినతులు అందుతున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే భూముల విలువ పెంచొద్దని రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. రెండేళ్లుగా భూముల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పడిపోయాయి. అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ దస్తావేజుల సంఖ్య 50శాతానికి పడిపోయింది. జిల్లాలో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.502 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటి వరకూ రూ.242 కోట్లు మా త్రమే వచ్చింది. అంటే 50శాతం కూడా పూర్తికా లేదు. ఆదాయం తగ్గడానికి రియల్ రంగం దెబ్బతినడమే కారణమని రిజిస్ట్రేషన్ అధికారులే అంటున్నారు. ఈనేపథ్యంలో భూముల విలువ పెంచడం వలన రిజిస్ట్రేషన్లు మరింత తగ్గుతాయని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణాల్లో 5, గ్రామీణంలో 20శాతం పెరిగే అవకాశం
పట్టణ ప్రాంతాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 20శాతం భూముల విలువ పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూముల విలువ పెరిగితే అదేస్థాయిలో రిజిస్ట్రేషన్ చార్జీలు అధికమవుతాయి. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉన్న భూముల విలువ పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా పెంచాలని ప్రాథమికంగా నివేదికలు సిద్ధం చేశారు. ఒంగోలు నగరంతోపాటు నగరపంచాయతీలు, మండలకేంద్రాలు, ముఖ్యమైన గ్రామాలలో భూములు విలువ పెరగనుంది..
రిజిస్ట్రేషన్ అధికారులు సిద్ధం చేసిన ముసాయిదా ఇలా..
ఒంగోలు నగరంలోని లాయర్‌పేటలో గజం రూ.29 వేలు ఉన్న భూమి విలువ రూ.30వేలకు పెరగనుంది.
కొండయ్య బంకు వీధిలో గజం రూ.22వేలు కాగా రూ.24వేలు కానుంది.
రాజాపానగల్ రోడ్డులో ప్రస్తుతం రూ.30వేలు ఉన్న గజం విలువ రూ.32వేలకు చేరనుంది.
పెళ్లూరు కోటవీధిలో ప్రస్తుతం గజం రూ.5,400 ఉండగా దాన్ని రూ.6వేలకు పెంచేందుకు సిద్ధమయ్యారు.
ముక్తినూతలపాడులో ఎకరా రూ.40లక్షలు కాగా ఇకపై రూ.42 లక్షలు కానుంది.
కొత్తపట్నం మండలం అల్లూరులో ఎకరా భూమి విలువ రూ.9లక్షలు ఉండగా రూ.10లక్షలకు పెంచనున్నారు.
యరజర్లలో ఎకరా రూ.5.5లక్షలు ఉండగా ఇకపై రూ.6లక్షలకు చేరనుంది.
మామిడిపాలెంలో ఎకరా రూ.37 లక్షలు ఉండగా రూ.39 లక్షలకు పెరగనుంది.
కంభం టౌన్‌లో గజం విలువ రూ.6వేలు కాగా రూ.6,200లకు పెంచనున్నారు.
కంభం ప్రాంతంలో ఎకరం రూ.1.10లక్షలు కాగా.. రూ1.20 లక్షలకు పెంచేందుకు అధికారులు ప్రాఽథమికంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనలపై జిల్లా మార్కెట్ విలువల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బుధ, గురువారాల్లో జాయింట్ కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అవసరమైన చోట మాత్రమే ధరలు పెంచాలని సూచించారు. అందుకను గుణంగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
24 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు: జిల్లా రిజిస్ట్రార్
జిల్లాలో సాధారణ రివిజన్ మేరకు భూముల విలువలు పెంచనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు తెలిపారు. పెంచిన భూముల ధరలను సంబంధిత సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ఐజీఆర్‌ఎస్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 24లోపు ఆధారాలతో తెలియజేయాలని కోరారు. 26న జిల్లా కమిటీ సమావేశమై తిరిగి పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చేనెల 1 నుంచి రివిజన్ చేసిన ధరలు అమలులోకి వస్తాయన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 01:07 AM