ఒడిశా టూ ఒంగోలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:19 AM
గంజాయి ముఠాలు రూటు మార్చాయి. అక్రమ రవాణాపై రాష్ట్రంలో పోలీసులు నిఘా పటిష్టం చేయడంతో అక్రమార్కులు ఒడిశా వైపు దృష్టి సారించారు. అక్కడి నుంచి జోరుగా జిల్లాలోకి గంజాయి వస్తోంది. కొందరు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు.
జోరుగా గంజాయి రవాణా
ముగ్గురు నిందితుల అరెస్టు
రెండు కిలోల సరుకు పట్టివేత
మధ్యవర్తిత్వం చేసిన ఓ మహిళ
ఒంగోలు క్రైం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గంజాయి ముఠాలు రూటు మార్చాయి. అక్రమ రవాణాపై రాష్ట్రంలో పోలీసులు నిఘా పటిష్టం చేయడంతో అక్రమార్కులు ఒడిశా వైపు దృష్టి సారించారు. అక్కడి నుంచి జోరుగా జిల్లాలోకి గంజాయి వస్తోంది. కొందరు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్‌లో ముగ్గురు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయ్యింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక విజయనగర్ కాలనీకి చెందిన షేక్ ఖాజా, బండారు భార్గవ్‌లు చీమకుర్తి మండలం మర్రిచెట్టపాలెంనకు చెందిన ఓ యువతి ద్వారా ఒడిశాలోని బి.సూరజ్ ఆచార్యను ఫోన్‌లో సంప్రదించారు. ఆచార్య మంగళవారం ఉదయం రెండు కిలోల గంజాయి ప్యాకెట్లను తీసుకొని స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చాడు. అప్పటికే ఫోన్‌లో సంప్రదింపులు చేస్తున్న ఖాజా, భార్గవ్‌లు సూరజ్ ఆచార్యను కలిశారు. ఆయన నుంచి గంజాయి ప్యాకెట్లు తీసుకొని డబ్బులు ఇస్తున్న సమయంలో అప్పటికే సమాచారం అందుకున్న ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు సిబ్బందితో దాడి చేశారు. అక్కడ గంజాయి కలిగి ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద రెండు కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 01:19 AM