పెయ్యలతిప్పను తవ్వేస్తున్నారు!
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:50 AM
జిల్లాలో కీలకమైన జలవనరు కందులు ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి భారీ ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ నుంచి బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్న క్రమంలో సదరు కాంట్రాక్టు సంస్థ మండల పరిఽధిలో ఉన్న గార్లపాడు గ్రావెల్ కొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు ప్రారంభించడంతో బుధవారం దొడ్డవరం గ్రామస్థులు అడ్డుకున్నారు.
గ్రావెల్ తవ్వకంతో ప్రాజెక్టుకు ముప్పు
ఎఫ్‌ఆర్‌ఎల్ లోపు తవ్వుకోవడానికి మాత్రమే అనుమతించిన ఎస్‌ఈ
మద్దిపాడు, డిసెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలకమైన జలవనరు కందులు ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి భారీ ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ నుంచి బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్న క్రమంలో సదరు కాంట్రాక్టు సంస్థ మండల పరిఽధిలో ఉన్న గార్లపాడు గ్రావెల్ కొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు ప్రారంభించడంతో బుధవారం దొడ్డవరం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గుండ్లకమ్మ జలాశయం కుడి కరకట్టకు దన్నుగా నిలిచిన పెయ్యలతిప్పను ఆనుకొని జలాశయం లోపల వైపు ఉన్న గ్రావెల్‌ను తవ్వుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు ప్రాజెక్టుల ఎస్‌ఈ అనుమతి ఇవ్వడంతో ఆ సంస్థ గురువారం పెయ్యాలతిప్పకు వెళ్లడానికి ధేనువకొండ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఎన్నెస్పీ కెనాల్ మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నెస్పీ కెనాల్‌ను కొంతమేర పూడ్చివేశారు. సదరు కంపెనీ పెయ్యాలతిప్ప నుంచి గ్రావెల్ తరలిస్తే రిజర్వాయర్‌కి కుడివైపున ఉన్న కరకట్టకు బలం తగ్గి నీరు బయటకు వస్తే గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. గతంలోనే పెయ్యలతిప్ప నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు గ్రావెల్‌ను తరలించుకుపోయారు. ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్ కంపెనీకి వేల టన్నుల గ్రావెల్ అవసరం ఉంది. దీంతో వారు ఎఫ్‌ఆర్‌ఎల్ బయట కాకుండా గ్రావెల్ తరలించడానికి గతంలో పాతి ఉన్న రాళ్లను సైతం పెకిలించి వేసి గ్రావెల్ తవ్వుతున్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా హద్దులు నిర్ణయించకుండా జలాశయం అధికారులు అనుమతులు ఇవ్వడంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానన్నారు. గుండ్లకమ్మ జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడానికి జలాశయ ఎఫ్‌ఆర్‌ఎల్ సామర్థ్యాన్ని పెంచడానికి అనుమతులు ఇచ్చామని చెబుతుండగా ఇరిగేషన్, రెవెన్యూ వారు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ రిజర్వాయర్‌ను నిలువునా ముంచే స్థితికి తీసుకొస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:50 AM