దేవదాయశాఖ పేరుతో రైతులతో చెలగాటం
ABN, Publish Date - Dec 29 , 2024 | 01:21 AM
దేవదాయశాఖ పేరుతో అధికారులు రైతులతో చెలగాటమాడుతున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూముల విషయంలో రెవెన్యూ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ చేయకుండా దాటవేస్తుండటంతో అర్హులైన రైతులు ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూర్వీకుల నుంచి సాగులో ఉన్న భూములను ఆన్‌లైన్ చేయకుండా వేధింపులు
కోర్టు తీర్పులు వచ్చినా పట్టించుకోని అధికారులు
రెవెన్యూ సదస్సుల్లో రైతుల గగ్గోలు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ పేరుతో అధికారులు రైతులతో చెలగాటమాడుతున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూముల విషయంలో రెవెన్యూ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ చేయకుండా దాటవేస్తుండటంతో అర్హులైన రైతులు ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇవే సమస్య లపై గగ్గోలుపెడుతున్నారు. మద్దిపాడు మండలం బసవన్నపాలెం, దొడ్డవరప్పాడు, వెంకటరాజుపాలెం తదితర గ్రామాలకు చెందిన వారు తమ భూములను ఆన్‌లైన్ చేయాలని ఆందోళన చేపట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్పందన కరువు
ఇనమనమెళ్లూరు గ్రామ సర్వేనెంబర్‌లోని 291, 322, 324, 328, 329, 333, 391లో సుమారు 170.16 ఎకరాల భూమిని ఆయా గ్రామాల్లోని 230మంది రైతులు 30 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నారు. అటువంటి భూములపై అనేక వివాదాలు నడిచి రైతులే హక్కుదారులుగా పలు న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. రైతులు అనేక పర్యాయాలు మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఉన్నతాధికారులను కలిసి సమస్యను విన్నవించినా స్పందన కరువైంది. ఆ విధంగా జిల్లాలోని పలుప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలులోనూ నిలిపివేత
జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా సుదీర్ఘకాలం నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న గృహాలపై కూడా దేవదాయశాఖ పేరుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇటు దేవదాయశాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
దేవదాయశాఖ మంత్రిని కలిసిన రైతులు
మద్దిపాడు మండలంలోని బసవన్నపాలెం, దొడ్డవరప్పాడు, వెంకటరాజుపాలెం గ్రామాల్లో తమ భూములను దేవదాయశాఖ భూములంటూ చెలగాటం ఆడుతున్నారని పలువురు రైతులు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి విన్నవించుకున్నారు. శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు, రైతులు కలిసి దేవదాయ భూముల సమస్యపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, దేవదాయశాఖ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు గోరంట్ల వెంకట్రావు మాట్లాడుతూ తమ గ్రామాల్లో 230మంది రైతులు 300 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న భూములు మీద ఎన్నో వివాదాలు నడిచి రైతులే హక్కుదారులుగా పలు న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయని తెలిపారు. రైతులకే సంపూర్ణ హక్కులు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, తుమ్మల వీరాంజనేయులు, మండవ వెంకట్రావు, మండవ శ్రీని వాసరావు, అబ్బూరి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 01:21 AM