ఆ వైద్యాధికారికి అందలం
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:04 AM
ఆయన ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి. తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేస్తారు. వారు చెప్పినట్లు వినకపోతే వేధింపులకు పాల్పడుతారు. ఆ వేధింపులు భరించలేని ఆ మహిళా ఉద్యోగులు అందరూ ఒక్కటై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఆ వైద్యాధికారి చేస్తున్న వికృత చేష్టలు నిజమేనని తేల్చారు.
మహిళా ఉద్యోగులను వేధించడంతో సరెండర్
ఆ వెంటనే పైస్థాయిలో వ్యవహారం నడిపి మళ్లీ జిల్లాకే
జిల్లాకేంద్ర కార్యాలయంలో అన్నీతానై నడుపుతున్న వైనం
కూటమి ప్రభుత్వంలోనూ ఉన్నతాధికారుల్లో రాని మార్పు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆయన ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి. తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేస్తారు. వారు చెప్పినట్లు వినకపోతే వేధింపులకు పాల్పడుతారు. ఆ వేధింపులు భరించలేని ఆ మహిళా ఉద్యోగులు అందరూ ఒక్కటై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఆ వైద్యాధికారి చేస్తున్న వికృత చేష్టలు నిజమేనని తేల్చారు. గుట్టుచప్పుడు కాకుండా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఇదీ పశ్చిమప్రాంతంలోని ఒక మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో జరిగిన వ్యవహారం. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో ఏమి జరిగిందో తెలియదు కానీ వారంరోజుల్లోనే తిరిగి జిల్లా వైద్యారోగశాఖకు ఆ డాక్టర్‌ను డిప్యుటేషన్ వేశారు. వాస్తవంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటే కనీసం మరొక జిల్లాలో నియమిస్తారు. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో ఆ వైద్యాధికారి తన పలుకుబడిని చూపి వారంరోజులు తిరక్కముందే జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వచ్చి వాలిపోయారు.
శాఖలో తిష్ట వేసి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ వైద్యాధికారి వైద్యశాఖలో అనధికారికంగా విధులు నిర్వహించి ప్రైవేటు వైద్యశాలలకు అనుమతులు ఇచ్చేందుకు భారీగా మామూళ్లు వసూలు చేశారన్న ఆరోపణలుఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు వైద్యశాఖలోనే తిష్టవేశారు. పని కోసం వచ్చే ఉద్యోగులతో మాట్లాడి అంతా తాను చూస్తానంటూ సంబంధిత శాఖ ఉన్నతాధికారి వద్దకు తనే స్వయంగా తీసుకొని వెళ్తున్నారు. ఆ వైద్యశాఖ కార్యాలయంలో సంబంధిత సెక్షన్ ఉద్యోగులకు తెలియని అంశాలు కూడా ఆయన వద్ద ఉన్నాయంటే వైద్యశాఖ పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.
వైద్యశాఖను పట్టించుకోని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ప్రభుత్వ శాఖలను ఇప్పటికే ప్రక్షాళన చేసింది. కానీ వైద్యశాఖను మాత్రం పట్టించుకోలేదు. పది నెలల నుంచి రెగ్యులర్ వైద్యాధికారి లేకపోవడంతో ఇన్‌చార్జి పాలన నడుస్తోంది. ఆ కార్యాలయంలో ఏమి జరుగుతుందో తెలియడం లేదు. ఇక్కడ ఏదైనా జరిగితే పైస్థాయిలో తమకు అండదండలు అందించే ఒక అధికారి ఉండటంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకంలో అడ్డగోలుగా వ్యవహరించిన సమయంలో జిల్లా కార్యాలయంలోనే పనిచేసిన ఆ అఽధికారి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసులో కీలక స్థానంలో ఉన్నారు. దీంతో తమకు ఏమీ కాదన్న ఉద్దేశంతో కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌తోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వైద్యశాఖను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు.
Updated Date - Dec 21 , 2024 | 01:04 AM