Ganesh immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడుదల
ABN, Publish Date - Sep 16 , 2024 | 09:08 AM
భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. పోలీసుల ఆంక్షలను గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక ప్రతిమలను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు 17,18వ తేదీల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీ, భారీ అతిభారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదలైంది. పోలీసుల ఆంక్షలను గమనిస్తూ నిమజ్జనాలకు వినాయక ప్రతిమలను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు 17,18వ తేదీల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీ, భారీ అతిభారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన ఊరేగింపు మార్గాలు ఇలా
బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. కేశవగిరి - చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ - ఎడమ మలుపు - ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ - ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ - అలియాబాద్ - నాగుల్చింత - చార్మినార్ - మదీనా - అఫ్జల్‌గున్ - ఆఫ్ ఎస్ఏ బజార్ - ఎంజే మార్కెట్ - అబిడ్స్ క్రాస్ రోడ్ - బషీర్ బాగ్ - లిబర్టీ జంక్షన్ - ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అంబేద్కర్ విగ్రహం.
సికింద్రాబాద్ నుంచి ఊరేగింపు సంగీత్ థియేటర్ - ప్యాట్నీ - ప్యారడైజ్ జంక్షన్ -ఎండీ రోడ్ - రాణిగంజ్ - కర్బలా మైదాన్ - సోనాబాయి మసీదు - ట్యాంక్ బండ్ గుండా వెళుతుంది. ఎన్టీఆర్ మార్గ్ - పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) చేరుకుంటుంది.
చిల్కలగూడ క్రాస్ రోడ్ల నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ - ఆర్టీసీ ఎక్స్ రోడ్ - నారాయణగూడ ఫ్లైఓవర్ - నారాయణగూడ వై జంక్షన్ - హిమాయత్ నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
ఈస్ట్ జోన్, ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపు రామంతపూర్ - శ్రీ రమణ జంక్షన్ - 6 నెం. జంక్షన్ - తిలక్ నగర్ - శివం రోడ్ - ఓయూ ఎన్‌సీసీ - విద్యా నగర్ టీ జంక్షన్ - హిందీ మహావిద్యాలయ క్రాస్ రోడ్ - ఫీవర్ హాస్పిటల్ - టీవై మండలి - బర్కత్‌పురా క్రాస్ రోడ్ల మీదుగా వెళుతుంది. వైఎంసీఏ, నారాయణగూడ క్రాస్ రోడ్ చేరుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో చేరుతుంది.
దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్ సదన్ - సైదాబాద్ - చంచల్‌గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ క్రాస్ రోడ్స్‌లో చేరతాయి. పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి.
తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపుగా చేరుతాయి.
టోలీచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం వైపుల నుంచి వచ్చే ఊరేగింపులు మాసబ్ ట్యాంక్ - అయోధ్య జంక్షన్ - నిరంకారి భవన్ - ద్వారకా హోటల్ జంక్షన్ - ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) చేరుకుంటాయి.
ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్-అమీర్‌పేట్-పంజాగుట్ట-ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారీ భవన్‌లో చేరి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వరకు వెళ్తాయి.
టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్ - బోయిగూడ కమాన్ - వోల్గా హోటల్ క్రాస్ రోడ్స్ - అఘాపురా (సిండికేట్ బ్యాంక్) - గోషామహల్ బారాదరి - అలాస్కా - మలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.
ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవెర్షన్ ప్రధాన ఊరేగింపు మార్గల్లో విగ్రహాన్ని మోసుకెళ్లే వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలు అనుమతి ఉండదు.
17వ తేదీ 10 గంటల నుంచి 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. అవసరమైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలు పొడిగిస్తాయి.
ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌లలో 17వ తేదీ 6గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు..
భారీ, అతిభారీ కమర్షియల్ వాహనాలు, ఇంటర్ డిస్ట్రిక్ట్, నేషనల్ పర్మిట్, లోకల్ లారీలపై ఆంక్షలు పోలీసులు విధించారు. నగరంలోకి ప్రవేశించడానికి అనుమతిలేదని స్పష్టం చేశారు. భారీ, అతిభారీ వాహనాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండా ఔటర్ మార్గం గుండా వెళ్లాలని పోలీసులు సూచించారు. స్థానిక లారీలు, నిర్మాణ సామగ్రి వాహనాలు 17న ఉదయం 8 గంటల నుంచి నగరంలోకి అనుమతి ఉండదని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల రూట్‌పై ఆంక్షలు..
ఆర్టీసీ బస్సుల రూట్‌పై కూడా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. 17 నుంచి 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఆర్టీసీ సిటీ రీజియన్ బస్సులకు కూడా వర్తిస్తాయని చెప్పారు. ఊరేగింపు ఉధృతంగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు క్రింది జంక్షన్‌లను దాటి అనుమతించబోమని తెలిపారు.
జంక్షలు ఇవే..
● మాసబ్ ట్యాంక్ (మెహదీపట్నం బస్సులు)
● వీవీ విగ్రహం (కూకట్‌పల్లి బస్సులు)
● సీటీవో, ప్లాజా, ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్, చిల్కలగూడ క్రాస్ రోడ్ (సికింద్రాబాద్ బస్సులు)
● రామంతపూర్ టీవీ స్టేషన్ (ఉప్పల్ బస్సులు)
● గడ్డి అన్నారం.
Updated Date - Sep 16 , 2024 | 09:24 AM