ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుపారీ చెల్లించి.. హత్యకు యత్నించి..

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:21 AM

పలాస-కాశీబుగ్గలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారు. దీనికోసం బీహార్‌కు చెందిన ముఠాకు రూ.10లక్షల సుపారీ చెల్లించి పలాస రప్పించారు. వారు రెక్కీ నిర్వహిస్తుండగా, పోలీసులకు సమాచారం అందడంతో ఈ హత్య కుట్రను భగ్నం చేశారు. ముగ్గురు బీహార్‌ వ్యక్తులతో పాటు నలుగురు వైసీపీ నాయకులను అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

- టీడీపీ నేతను హతమార్చేందుకు కుట్ర

- బీహార్‌ గ్యాంగ్‌ను రప్పించిన వైసీపీ నాయకులు

- భగ్నం చేసిన పోలీసులు

- ముగ్గురు బీహారీ వాసులు, నలుగురు వైసీపీ నేతల అరెస్టు

- రెండు నాటు తుపాకులు, తపంచా, 45 బుల్లెట్లు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

పలాస, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు హత్యకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారు. దీనికోసం బీహార్‌కు చెందిన ముఠాకు రూ.10లక్షల సుపారీ చెల్లించి పలాస రప్పించారు. వారు రెక్కీ నిర్వహిస్తుండగా, పోలీసులకు సమాచారం అందడంతో ఈ హత్య కుట్రను భగ్నం చేశారు. ముగ్గురు బీహార్‌ వ్యక్తులతో పాటు నలుగురు వైసీపీ నాయకులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు నాటు తుపాకీలు, ఒక తపంచా, 45 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శనివారం మధ్యాహ్నం కాశీబుగ్గ పోలీస్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు.

మూడు నెలల కిందటే ప్లానింగ్‌..

టీడీపీ పలాస-కాశీబుగ్గ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు స్వగ్రామం చిన్నబడాం. అదే గ్రామానికి చెందిన కూర్మాపు ధర్మారావు వైసీపీ నాయకుడిగా చలామనీ అవుతున్నాడు. ధర్మారావు అనుచరులుగా అదే గ్రామానికి చెందిన అంపోలు శ్రీనివాసరావు, హనుమంతు బాబూరావు, కోత శ్రీనివాసరావు, మందస మండలం జిల్లుండ గ్రామానికి రౌతు చంద్రశేఖర్‌ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాగరాజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గ్రామానికి వైసీపీ నాయకులు ఆయనపై కక్షసాధింపునకు దిగారు. వ్యాపారాలను బంద్‌ చేయించారు. అలాగే రౌడీషీట్‌తో సహా మొత్తం పది కేసులు నమోదు చేయించారు. చివరకు ఆయన ఇంటిని సైతం కూల్చివేయడానికి సిద్ధమయ్యారు. అన్నింటినీ తట్టుకొని నాగరాజు నిలబడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాగరాజు తనకు గతంలో జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీయడం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన వైసీపీ నేతలపై పోలీసులకు నేరుగా ఫిర్యాదులు చేశాడు. ధర్మారావు నిర్వహిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వ్యక్తిగత కక్షలతో నాగరాజు అడ్డుపడుతున్నాడని, ప్రతీదానికి తమను ప్రశ్నిస్తున్నాడని, అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, ఆయన్ను అడ్డుతొలగించుకుంటే తమకు ఇబ్బందులు ఉండవని వైసీపీ నాయకులు భావించారు. ఈ మేరకు అక్టోబరులో చిన్నబడాం తోటల్లో ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావు, బాబూరావు, కోత శ్రీనివాసరావు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగరాజును ఏ విధంగానైనా హత్యచేయాలని భావించారు. దీనికోసం బీహార్‌ రాష్ట్రానికి చెందిన సుపారీ గ్యాంగ్‌ను వినియోగించాలని పథకం రచించారు. ఈ మేరకు హనుమంతు బాబూరావు, పొన్నాడ కృష్ణారావు.. బీహార్‌ కిరాయి ముఠాను సంప్రదించారు. కొద్దిరోజుల కిందట విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వారితో మంతనాలు జరిపారు. రూ.10లక్షలు సుపారీకి ఒప్పందం కుదుర్చుకొని నాగరాజును హత్య చేయాలని చెప్పారు.

రెక్కీ నిర్వహిస్తుండగా..

ఈ నెల 20న స్థానిక వైసీపీ నేతలు అంపోలు శ్రీనివాసరావు(చిన్నబడాం గ్రామం), రౌతు చంద్రశేఖర్‌(మందస మండలం జిల్లుండ)తో పాటు, బీహార్‌ రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ రాజాఖాన్‌, ఎండీ అమీర్‌ రెండు ద్విచక్ర వాహనాలపై తుపాకీలు, కంట్రిమేడ్‌ రివాల్వర్‌తో వచ్చి నాగరాజు నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. తాము అనుకున్న హత్య పథకాన్ని అమలు చేయడానికి వేచి ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులకు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ నలుగుర్ని పట్టుకున్నారు. వారి నుంచి రెండు తుపాకీలు, ఒక తపంచా, 45 రౌండ్లు బుల్లెట్లు, ఒక కారు, మూడు దొంగిలించిన ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వైసీపీ నేతలు కూర్మాపు ధర్మారావు, కోత శ్రీనివాసరావుతోపాటు బీహార్‌కు చెందిన మరో వ్యక్తి నిరంజన్‌కుమార్‌పాశ్వాన్‌.. కోసంగిపురం వద్ద ఓ అద్దె ఇంటిలో తలదాచుకోగా వారిని కూడా అరెస్టు చేశారు. మరో 10 మంది వ్యక్తులపై అభియోగాలు ఉన్నాయని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

వేగంగా స్పందించి.. నిండు ప్రాణం కాపాడి

ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మారావు, ఆయన అనుచరుల కదలికలపై క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక పోలీసులు, సాంకేతిక బృందం ప్రత్యేకంగా విడిపోయి నిఘా పెట్టారు. దీంతో నిందితులను సకాలంలో పట్టుకోవడంతో పాటు పక్కా ఆధారాలు కూడా సేకరించారు. వారి కార్యకలాపాలు అనుమానంగా ఉండడంతో పోలీసులు వేగంగా స్పందించి ఓ నిండు ప్రాణాలను కాపాడారంటూ పోలీసులను ఎస్పీ అభినందించారు. వారికి త్వరలోనే రివార్డులు అందిస్తామని తెలిపారు.

మాజీమంత్రి పాత్రపై అనుమానాలు..

టీడీపీ నేత నాగరాజు హత్యకు కుట్రపన్నారనే అభియోగంపై కొన్నిరోజుల కిందట ఇద్దరు వైసీపీ నాయకులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మాజీమంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన అనుచరులు కాశీబుగ్గ పోలీస్టేషన్‌ వద్ద హంగామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓ మీడియా ప్రతినిధి ఎస్పీని ప్రశ్నించగా.. ఆందోళన చేయడం సరైంది కాదని, చట్టం తన పనితాను చేసుకుపోతుందన్నారు. దీంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. నాగరాజు వ్యవహారంలో ఇంకా 10 మంది వరకూ వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే ప్రచారం జోరందుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జాబితాలో తమ పేర్లు ఎక్కడ ఉంటాయోనని వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ ప్రాంతానికి పరిచయం లేని బీహార్‌ సుపారీ గ్యాంగ్‌ను ఆ రాష్ట్రానికి వెళ్లి కలిసిన వ్యక్తి ఎవరు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన పలాసకు చెందిన వ్యక్తిగా ఇప్పటికే గుర్తించారు. ఆయన్ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను పంపించారు.

Updated Date - Dec 22 , 2024 | 12:21 AM