రైతులకు మరో అవకాశం
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:01 AM
పంటల బీమా నమోదు ప్రభుత్వం గడువు పెంచింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే రైతులు పడే బాధలు వర్ణనాతీతం. అటువంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రధానమంత్రి పసల్ బీమా యోజన పథకం కింద పరిహారం అందజేస్తున్నాయి.
పంటల బీమాకు నెలాఖరు వరకూ గడువు
హిరమండలం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పంటల బీమా నమోదు ప్రభుత్వం గడువు పెంచింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే రైతులు పడే బాధలు వర్ణనాతీతం. అటువంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రధానమంత్రి పసల్ బీమా యోజన పథకం కింద పరిహారం అందజేస్తున్నాయి. ఈ సారి రబీసీజన్‌లో శనగ, వరి, జొన్న, మినుము, మిరప, మొక్కజొన్న పంటలకు బీమా సదుపాయం కల్పించాయి. నిబంధనలు ప్రకారం వరి తప్ప ఇతర పంటలు వేసిన రైతులు ఈ నెల 15లోగా బీమా నమోదు చేసుకోవాలి. కానీ చాలామంది రైతులు నమోదు చేసుకోలేదు. రైతులు అందరికీ ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 31 వరకూ గడువు పెంచింది. ఖరీఫ్ సీజన్‌లో పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి.. రైతులందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంది. రబీ సీజన్‌లో మాత్రం బీమా పథకంలో రైతు వాటా కింద నామమాత్రంగా ప్రీమియం చెల్లించాలి. వరి గ్రామం యూనిట్‌గా, వేరుశనగ జిల్లా యూనిట్‌గా, మిగిలిన పంటలు మండలం యూనిట్‌గా బీమా వర్తింపజేయనున్నారు. వరి పంటకు సంబంధించి ఎకరాకు రూ.630 ప్రీమియం సొమ్ము రైతులు చెల్లించాలి. పంటలు దెబ్బతింటే ఎకరాకు బీమా కంపెనీ రూ.4,200 చెల్లిస్తుంది. పంట సరాసరి దిగుబడి తగ్గినా పరిహారం అందుతుంది. రైతులకు రుణాలిచ్చే బ్యాంకులు, సొసైటీలు ముందే బీమా సొమ్ము మినహాయించుకుని రుణం అందిస్తాయి. అందువల్ల రుణం పొందిన రైతులు బీమా చెల్లించాల్సిన పనిలేదు. మిగిలినవారు తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలి. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 640 మంది రైతులు పంటల బీమా నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 23,993 హెక్టార్లలో రబీ సాగు చేసినా.. కేవలం 315 హెక్టార్లకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన రైతులు తక్షణమే బీమా చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని హిరమండలం వ్యవసాయాధికారి బి.సంధ్య తెలిపారు.
- ఎలా నమోదు చేసుకోవాలంటే..
రైతుసేవ, మీ సేవ కేంద్రాల్లో రైతులు బీమా నమోదు చేసుకోవాలి. ఈ-క్రాప్‌తోపాటు రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరచాలి. సాగు ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఆన్‌లైన్ నిర్దేశిత రుసుం చెల్లిస్తే రశీదు బీమా పత్రం అందజేస్తారు. దానిని అధికారులకు అందజేయాలి. విపత్తుల సమయంలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోతే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పంట నష్టాన్ని అంచనా వేసి బీమా సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
Updated Date - Dec 23 , 2024 | 12:01 AM