Good governance: ‘సంక్షేమ’ సంవత్సరం
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:59 PM
Political instability వైసీపీ విధ్వంసకర పాలనతో గత ఐదేళ్లూ విసిగిపోయిన జిల్లావాసులకు.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల రూపంలో సంక్షేమ సంవత్సరంగా మిగిలింది. జూన్ 4న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల హామీ మేరకు ఏప్రిల్ నుంచే రూ.వెయ్యి చొప్పున పింఛన్ పెంపు వర్తించేలా ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది
జూన్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం
ఏప్రిల్ నుంచే ప్రజలకు లబ్ధి
ముందుగా పింఛన్ల పెంపు.. తర్వాత చెత్తపన్ను రద్దు
ఉచిత గ్యాస్ సిలెండర్ పంపిణీ కూడా అమలు
సాగునీటి రంగానికి తొలి ప్రాధాన్యం
అంతటా ఉచిత ఇసుక
ప్రభుత్వ పాలనపై సర్వత్రా హర్షం
శ్రీకాకుళం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ విధ్వంసకర పాలనతో గత ఐదేళ్లూ విసిగిపోయిన జిల్లావాసులకు.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల రూపంలో సంక్షేమ సంవత్సరంగా మిగిలింది. జూన్ 4న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల హామీ మేరకు ఏప్రిల్ నుంచే రూ.వెయ్యి చొప్పున పింఛన్ పెంపు వర్తించేలా ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. మరోవైపు జిల్లాలో ఐదేళ్లుగా మూతపడిన అన్నక్యాంటీన్లను మళ్లీ తెరిచింది. పేదలకు రూ.5కే కడుపు నిండా భోజనం అందజేస్తోంది. అలాగే ఉచిత ఇసుక విధానంతోపాటు ఏడాదికి మూడు చొప్పున ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మరోవైపు చెత్త పన్ను సైతం రద్దు చేసింది. ‘పల్లె పండుగ’ పేరిట జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారులను బాగు చేస్తోంది. దీంతో కూటమి పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పింఛన్‌దారులకు అండగా.. :
ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏప్రిల్ నుంచే సామాజిక పింఛన్లు రూ.వెయ్యి చొప్పున పెంచారు. జూలైలో రూ.4వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తంగా రూ.7వేలను పింఛన్ లబ్ధిదారులకు అందజేశారు. గతంలో వలంటీర్లు ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ వీలుకాదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ముందు వాదించారు. కాగా.. ప్రస్తుతం ఒకటో తేదీ నాటికే దాదాపు వందశాతం పూర్తయ్యేలా సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.2వేలు ఉన్న సామాజిక పింఛన్‌ను.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.250 చొప్పున పెంచింది. గత నాలుగేళ్లలో రూ.3వేలకు చేరింది. దీనికి అదనంగా రూ.వెయ్యి చొప్పున కూటమి ప్రభుత్వం అందజేస్తోంది. అలాగే దివ్యాంగులకు రూ.6వేలు చొప్పున పింఛన్ పంపిణీ చేస్తోంది. సీకేడీ రోగులు, ఇతర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచింది. జిల్లాలో మొత్తం 3,14,385 పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.128.40 కోట్లు వెచ్చిస్తోంది. దీంతో పింఛన్‌దారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఉచితంగా గ్యాస్ సిలెండర్లు :
వంట చేసే మహిళల ఇబ్బందులు దృష్ట్యా టీడీపీ ప్రభుత్వ హయాంలో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుతం దీపం-2 పథకం కింద ఏడాది మూడు సిలెండర్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలోనే ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు గత నెలలో ప్రారంభించారు. జిల్లాలో 2,10,780 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా.. ఇప్పటికే చాలామందికి తొలివిడతగా ఉచిత సిలెండర్లు పంపిణీ చేశారు. దీంతో మహిళల్లో ఆనందం ఉప్పొంగింది.
కాలువల్లో పూడికతీత.. ప్రాజెక్టులకు ప్రాధాన్యం :
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైంది. కనీసం కాలువల్లో పూడికతీతకు కూడా నిధులు మంజూరు చేయలేదు. సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టడం లేదంటూ ప్రతి జడ్పీ సమావేశాల్లో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులే అధికారులపై మండిపడేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టింది. ఉపాధిహామీ పథకం నిధుల ద్వారా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వంశధార, ఇతర సాగునీటి కాలువలలో పూడిక తీత పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది పుష్కలంగా సాగునీరందడంతో రైతుల్లో సంతోషం కనిపించింది. అలాగే ‘ఆఫ్‌షోర్’కు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులతో పాటు తొలిప్రాధాన్యం ఇస్తున్నట్లు తొలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్‌షోర్ కార్యరూపం దాల్చనుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
చెత్తపన్ను రద్దు.. :
జగన్ సర్కారులో అత్యంత మచ్చగా మిగిలిన చెత్త నిర్ణయం.. ‘చెత్త పన్ను’ విధించడం. అధికారంలోకి రాగానే చెత్త పన్నును రద్దు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రకటించారు. అదేరీతిన అధికారంలోకి వచ్చాక ‘చెత్త’పన్నును రద్దు చేశారు. దీంతో పట్టణ ప్రజలకు నెలవారీగా భారీ ఊరట కలిగింది.
ఇసుక వ్యాపారంతో రూ.కోట్లు సంపాదించుకున్న వైసీపీ నాయకులు..
జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో ఇసుక నిల్వలు అపారంగా ఉన్నాయి. గత ఐదేళ్లు.. వైసీపీ హయాంలో మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇసుక విక్రయాలతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఇసుకను లారీలతో విక్రయిస్తూ.. సామాన్యులు ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా ఇబ్బంది కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. రీచ్‌ల వద్ద రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేస్తోంది. కాగా.. ఇప్పటికీ ఇసుక తరలింపులో లోపాలున్నా.. వైసీపీ హయాం మాదిరిగా బరితెగింపులేదన్నది వాస్తవం. ఇదిలా ఉండగా పలాస సమీపంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఓ వైపు సంక్షేమ పథకాలతోపాటు.. మరోవైపు అభివృద్ధి దిశగా కూడా చర్యలు చేపడుతుండడంతో కూటమి ప్రభుత్వ పాలనపై జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
.......................
మరింత ఆర్థిక భద్రత
సామాజిక పింఛన్ పెంపు వల్ల వేలాది మంది వృద్ధులు, దివ్యాంగులకు మరింత ఆర్థిక భద్రత లభించింది. నెలవారీ మందులు.. ఇతరత్రా వైద్య ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ప్రభుత్వం భరోసా కల్పించింది.
- రామచంద్రపు జగద్వీశరరావు, ఇచ్ఛాపురం
................
ఉచితంగా సిలెండర్ ఇచ్చారు
రెండు దశాబ్దాల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో మాకు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే దీపం-2 పథకం కింద ఉచిత సిలెండరు ఇచ్చారు. మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పించారు.
- మాదిన శ్యామలమ్మ, కంచిలి
..................
ఇబ్బందులు లేకుండా సాగునీరు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశధార ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందింది. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వంశధార ప్రధాన కాలువలు అభివృద్ధికి కనీసం నిధులు కేటాయించలేదు. ప్రాజెక్టు నుంచి నీరు విడిచిపెడితే పలుచోట్ల గండ్లు పడేవి. దీంతోసాగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు పూడిక తీత పనులతో పాటు కాలువ గట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. శివారు భూములకూ సాగునీరందిస్తున్నారు.
- గోళ్ళ సింహాచలం, అక్కరాపల్లి, హిరమండలం
Updated Date - Dec 27 , 2024 | 11:59 PM