Share News

డ్రైవింగ్‌ పరీక్షలు ఎలా?

ABN , Publish Date - Mar 30 , 2024 | 11:54 PM

ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. ఇంధన శకట తనిఖీ అధికారులు(ఎంవీఐ) క్షేత్రస్థాయిలో నిర్వహించే డ్రైవింగ్‌ పరీక్షల్లో పాసైతేనే వాహనం నడిపేందుకు లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. అయితే డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ట్రాక్‌లు కొన్నిచోట్ల లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

డ్రైవింగ్‌ పరీక్షలు ఎలా?

- టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలో కానరాని ట్రాక్‌లు

- ప్రతిపాదనలకే పరిమితమైన నిర్మాణాలు

- వాహనదారులకు తప్పని ఇబ్బందులు

(టెక్కలి)

ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. ఇంధన శకట తనిఖీ అధికారులు(ఎంవీఐ) క్షేత్రస్థాయిలో నిర్వహించే డ్రైవింగ్‌ పరీక్షల్లో పాసైతేనే వాహనం నడిపేందుకు లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. అయితే డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ట్రాక్‌లు కొన్నిచోట్ల లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఎచ్చెర్ల సమీపంలో పది ఎకరాలను రవాణా శాఖకు గతంలో కేటాయించారు. ఇక్కడ ఒక చోట ట్రాక్‌ నిర్మాణం చేపట్టేందుకు ఇటీవల సంబంధిత కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. అయితే టెక్కలి ఎంవీఐ పరిధిలో ఏడు మండలాలు, పలాస, ఇచ్ఛాపురం ఎంవీఐల పరిధిలో చెరో ఐదు మండలాలు ఉన్నప్పటికీ ఇక్కడ డ్రైవింగ్‌ ట్రాక్‌ల నిర్మాణాలకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గతంలో ట్రాక్‌ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ప్రతిపాదనలు చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. టెక్కలి ఎంవీఐ పరిధిలో ట్రాక్‌ నిర్మాణానికి భీంపురం సమీపంలో గతంలో స్థలం చూపించారు. అది అనువుగా లేదని చెప్పి పక్కన పెట్టేశారు. డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు కనీసం ఆరున్నర ఎకరాల స్థలం ఉండాలి. ఇందులో ఒక లైట్‌ ట్రాక్‌, ఒక హెవీ ట్రాక్‌, టూవీలర్‌ ట్రాక్‌ నిర్మించాలి. టూవీలర్‌, హెవీ ట్రైలర్‌ నడిపే స్థలంతో పాటు అప్రోచ్‌ రోడ్డు, కనీసం వంద టూవీలర్ల పార్కింగ్‌ ప్రాంతం, రెస్ట్‌రూం సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. కనీసం ఆ ప్రాంతంలో ఎంవీఐ కార్యాలయ నిర్మాణానికి మూడువేల చదరపు అడుగుల స్థలం అవసరం. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను రవాణాశాఖకు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైంది. పట్టణాలకు శివారు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ స్థలాలను గుర్తించడంలో రెవెన్యూ, రవాణాశాఖలు సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లాలో అవసరమైన స్థలాలను సేకరించి డ్రైవింగ్‌ ట్రాక్‌లను నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

స్పీడ్‌గన్లు కరువు

వాహనాల వేగాన్ని గుర్తించేందుకు అవసరమైన స్పీడ్‌గన్లు సైతం ఆయా ఇంధన శకట కార్యాలయాలకు కరువయ్యాయి. జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో ఒకటి మాత్రమే స్పీడ్‌గన్‌ ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈఒక్క స్పీడ్‌గన్‌నే టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం ఎంవీఐ కార్యాలయాల పరిధిలో ఒక్కో వారం, ఒక్కో ప్రాంతానికి పంపిస్తున్నారు.

దృష్టి సారించలేదు

డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అవసరం. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. ట్రాక్‌ల ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపారో.. లేదో నాకు తెలియదు. ఎన్నికల విధుల్లో అధికారులంతా నిమగ్నం కావడంతో.. డ్రైవింగ్‌ ట్రాక్‌ల విషయమై దృష్టి సారించలేదు.

- ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, డీటీసీ

Updated Date - Mar 30 , 2024 | 11:54 PM