‘రథసప్తమి’ వేడుకల్లో.. తప్పులు పునరావృతం కారాదు
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:12 AM
‘అరసవల్లిలో నిర్వహించనున్న రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అధికారులంతా సమన్వయంతో పనిచేసి.. అంగరంగ వైభవంగా రథసప్తమి పండుగను నిర్వహించాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
- సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం
- డోనర్ పాసులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అరసవల్లి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘అరసవల్లిలో నిర్వహించనున్న రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అధికారులంతా సమన్వయంతో పనిచేసి.. అంగరంగ వైభవంగా రథసప్తమి పండుగను నిర్వహించాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కారాదని హెచ్చరించారు. సూర్యజయంతిని పురస్కరించుకుని రానున్న ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో అరసవల్లిలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ప్రతీచోటా నాయకుడు రథసప్తమి సందర్భంగా భక్తులను అధిక సంఖ్యలో వీఐపీ దర్శనానికి తీసుకువచ్చి హల్‌చల్ చేసి ఆలయ ప్రతిష్ఠను భ్రష్టు పట్టించారు. దీనికి చరమగీతం పాడాలి. సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గతంలో డోనర్, వీఐపీ పాసుల జారీలో అవకతవకలు జరిగాయి. ఆ తప్పులు పునరావృతం కారాదు. ఈసారి జనవరి 5లోగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే డోనర్ పాసులు జారీ చేయాలి. ప్రతీ పాస్‌పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. సిఫారసులకు తావు లేకుండా పకడ్బందీగా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలి. డోనర్లు రూ.500ల టిక్కెట్లు, ఉచిత దర్శనం భక్తులకు డీసీఎంస్ ఆఫీసు వద్ద నుంచి, వీఐపీలకు ముఖద్వారం వద్ద నుంచి ప్రవేశ ఏర్పాట్లు చేయాలి. భక్తులకు తాగునీరు, ఆహారం తదితర ఏర్పాట్లు చేయాలి. పార్కింగ్‌కు ముందుగానే మూడు ప్రదేశాలను గుర్తించాలి. పోలీసు బందోబస్తు పక్కాగా ఉండాలి. మీడియా పాయింట్ ఏర్పాట్లు చేయాలి. వేడుకల సమయంలో శ్రీకాకుళం, అరసవల్లిలో ప్రధాన కూడళ్లను విద్యుత్ వెలుగులతో సుందరంగా అలంకరించాలి. 2, 3 తేదీల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ క్రీడల్లో పోటీలను నిర్వహించాలి’ అని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, కింజరాపు హరవరప్రసాద్, డీఆర్వో అప్పారావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎంహెచ్‌వో డా.బి.మీనాక్షి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:12 AM