heavy rainfall; ఆగని వర్షాలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:38 AM
heavy rainfall; వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు, అల్పపీడనలు, వాయుగుండాలు జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి.
- తడుస్తున్న ధాన్యం బస్తాలు, వరి కుప్పలు
- మరో అల్పపీడనం హెచ్చరికతో ఆందోళన
జి.సిగడాం/సరుబుజ్జిలి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు, అల్పపీడనలు, వాయుగుండాలు జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒకే నెలలో ఒక భారీ తుఫాన్‌తో పాటు మూడు అల్పపీడనాలు ఏర్పడడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అల్పపీడన కారణంగా గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కళ్లాలు, పొలాల్లో ఉన్న వరి కుప్పలను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పొలాల్లో దిబ్బలుగా వేసి ఉన్న వరి పనలు మొలకెత్తే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
అపరాల పంటలైన పెసర, మినుమ అలాగే మొక్కజొన్న పంట కూడా వర్షాలకు పాడవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుబుజ్జిలి ఆమదాలవలస మండలాల్లోని వంశధార, నాగావళి పరివాహక లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యాయి. వాటిని పొలాల్లోనే కుప్పలుగా వేశారు. అయితే, ఈ నెల మొదటి వారంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ కారణంగా వర్షాలు పడడంతో ఆ కుప్పలు తడిసి పోయాయి. ఆ తరువాత వరుసగా ఏర్పడిన అల్పపీడనలు రైతులను నట్టేట ముంచాయి. నిత్యం కురుస్తున్న చిరుజల్లులతో వరి ఓదెలు తడిసి ముద్దవుతున్నాయి. అలాగే, పొలాలు, కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యంపై టార్పాలిన్లు, గడ్డి వంటివి కప్పినప్పటికీ అవి నానిపోతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనివల్ల రానున్న 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరింత నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ చివరి దశలో తాము నష్టపోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:38 AM