Political Review మట్టికరిచిన మహామహులు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:20 AM
shoking in ycp సార్వత్రిక ఎన్నికల సంవత్సరంగా 2024.. సిక్కోలు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ‘బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి’ అన్న చందంగా.. రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి.
జిల్లాలో తారుమారైన రాజకీయ పరిణామాలు
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సీనియర్లకు దెబ్బ
కూటమిలో కొత్త అభ్యర్థులకు ప్రజాదరణ
వైసీపీలో నైరాశ్యం.. కూటమిలో జోష్
సంక్షేమ దిశగా పాలనపై ప్రజల్లో హర్షం
2024.. మరో నాలుగు రోజుల్లో కాలగమనంలో కలిసిపోనుంది. ఈ ఏడాది జిల్లావాసులకు ఎన్నో తీపి జ్ఞాపకాలు... చేదు సంఘటనలు... మధుర ఘట్టాలను మిగిల్చింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ప్రత్యేకతను సంతరించుకుంది. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనకు ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో జిల్లావాసులు చరమగీతం పాడారు. కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారు. వైసీపీకి ఒక్కసీటు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. అంతటా విజయదుందుభి మోగించిన కూటమి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. సంక్షేమ దిశగా పాలన సాగిస్తుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
.................
శ్రీకాకుళం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సంవత్సరంగా 2024.. సిక్కోలు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ‘బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి’ అన్న చందంగా.. రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగిలిన స్థానాలన్నీ వైసీపీ దక్కించుకుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అధికార దర్పంతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీకి మనుగడ లేకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ.. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సీన్ మారింది. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ ఏడాది మే నెల వరకూ ప్రతాపం చూపిన వైసీపీని నామరూపాలు లేకుండా చేసి.. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జిల్లాలో ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకపోవడంతో ఆ పార్టీలో నిరుత్సాహం అలుముకుంది. ఈ ఎన్నికల్లో హేమాహేమీలకు కాదని ప్రజలు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన వారిని కూడా ఆదరించడం కూటమి ప్రభుత్వంలో జోష్ పెరిగింది.
వైసీపీకి విషాదమే..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మట్టి కరిచింది. శ్రీకాకుళం పార్లమెంట్‌తోపాటు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి ఘోర పరాజయం పొందారు. అలాగే విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి ఓటమి చెందారు. కూటమి పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో దిగగా.. బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయాల్లో సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం వంటివారు కనీవినీ ఎరుగని ఓటమిని చవిచూశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దిగజారుడు వ్యాఖ్యలు చేసినవారు ప్రజల ఛీత్కారంతో పరాభవం చెందారు. మహామహులు అని ఎన్నికల ముందు వరకు చెప్పుకున్నవారే... కొత్తవారి చేతిలో పరాజయం పాలయ్యారు. మొత్తానికి ఈ ఏడాది వైసీపీకి విషాదమే మిగిలింది.
కొత్త అభ్యర్థులు.. గెలుపుతో హుషారు...
ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు సాధారణమే. అయితే వైసీపీ రాజకీయ అధికార దర్పాన్ని తట్టుకుని.. ఇటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడమంటే చిన్నవిషయం కాదు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి కొత్తగా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, ఎచ్చెర్ల నుంచి బీజేపీ తరపున నడుకుదిటి ఈశ్వరరావు, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ముగ్గురూ కొత్త అభ్యర్థులే. సీనియర్లను కాదని.. యువతకు ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచనతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీసుకున్న ప్రయోగం విజయవంతమైంది. కొత్త అభ్యర్థుల చేతిలో వైసీపీకి చెందిన మహామహులు ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు 55వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎచ్చెర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, పాతపట్టణం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం ప్రాంతానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లభించలేదు. మొత్తం కూటమిదే హవా.
జిల్లా ప్రజలకు లాభమే
వైసీపీ ఓటమి చెందడం.. కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో జిల్లా ప్రజలకు లాభమే కలుగుతోంది. సంక్షేమ దిశగా పాలన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా సామాజిక పింఛన్‌దారులకు రూ.వెయ్యి పెంచుతూ ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ ఆ నగదును కూటమి ప్రభుత్వం అందజేసింది. దివ్యాంగులకు కూడా భారీగా పింఛన్ పెంచింది. అలాగే గత ఐదేళ్లూ మూతపడిన అన్న క్యాంటీన్‌లు.. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాసలో మళ్లీ తెరుచుకున్నాయి. రోజూ వేలాదిమంది పేదలు రూ.5 చొప్పున చెల్లించి ఈ క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఇక నిరుద్యోగులకు జాబ్‌క్యాలెండర్ అంటూ వైసీపీ మోసం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ అంటూ కొలువులు ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వడంతో యువత, అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లను మొదటి విడతగా లబ్ధిదారులు అందుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పల్లెప్రాంతాలు.. పట్టణ ప్రాంతాల్లో గత ఐదేళ్లు రోడ్లు అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు రోడ్లకు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు యాభైశాతం పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో సైతం రోడ్లు బాగుపడడంతో కూటమి పాలనపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Dec 27 , 2024 | 12:20 AM