Chandrababu Live Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. బిగ్ ట్విస్ట్!
ABN, Publish Date - Jan 16 , 2024 | 01:11 PM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చట్టం అమ్లలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్‌ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు.
అయితే స్కిల్ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని బోస్ స్పష్టం చేశారు. తగిన నివేదిక కోసం సీజేఐకి నివేదించామని చెప్పారు.
జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పులోని అంశాలు..
చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17-ఏ వర్తింపజేయలేం.
2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17(ఏ) ఏ నాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదు.
ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేం.
ఈ కేసులో సెక్షన్ 17(ఏ)ను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచేయాలి.
2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలి.
చట్టం రాకముందుకాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది. దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్థకం అవుతాయి. ఆ చట్టం మూల ఉద్దేశం దెబ్బతింటుంది.
అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17(ఏ) మూల ఉద్దేశం కాదు.
ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయి.
ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు.. కేవలం సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్.ఐ.ఆర్ కొట్టేయడానికి కారణం కారాదు.
జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పులోని అంశాలు..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం,
ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచారణ చేయడం తగదు.
అయితే రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయడం కుదరదు.
ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేం.
ఈ పరిస్థితుల్లో పిటిషన్‌ను డిస్పోస్ చేస్తున్నా.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Updated Date - Jan 16 , 2024 | 02:11 PM