నేర పరిశోధనలో ప్రతిభ
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:49 PM
కేసుల పురోగతిలో కర్నూలు జిల్లా పోలీసులు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
- రెండు రోజుల్లో చేధించిన పోలీసులు
- జిల్లాకు ఏబీసీడీ అవార్డు
కర్నూలు క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కేసుల పురోగతిలో కర్నూలు జిల్లా పోలీసులు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేసుల విచారణలో విశేష ప్రతిభ చూపడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్నారు. కేసుల పూర్వాపరాలు, కేసుల పరిష్కారంలో వినియోగించిన సాంకేతికత, వినూత్న విధానాలతో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన క్రైమ్ డిటెక్షన (ఏబీసీడీ) అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును తాజాగా డీఐజీ ద్వారకా తిరుమలరావు నుంచి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అందుకున్నారు.
ఫ నిందితులను పట్టించిన డ్రమ్ము
జూలై 28వ తేదీన చిన్నహోతూరు సమీపంలో డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. ఆ తర్వాత సమీప పోలీస్‌స్టేషనలో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? అని ఆరా తీశారు. ఆ రెండు, మూడు రోజుల్లో ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం వచ్చింది. అయితే పోలీసులు మృతదేహాన్ని ఉంచిన డ్రమ్మును నిశితంగా పరిశీలించారు. డ్రమ్ముపై ‘క్లారియంట్ ఐజీఎల్ స్పెషాలిటీ కెమికల్స్’ అనే లేబుల్ ఉంది. ఈ లేబుల్‌ను ఆనలైనలో పరిశీలిస్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ చెందిన డ్రమ్ముగా గుర్తించారు. ఆ కంపెనీ ప్రతినిధులను ఫోనలో సంప్రదించి ఆ డ్రమ్ము వివరాలు ఆరా తీశారు. ఆ డ్రమ్ము ఎక్కడెక్కడ సరఫరా చేస్తారో అడిగి తెలుసుకున్నారు. ఆ డ్రమ్ము హిందూపురం, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లుగా వివరించారు. ఆ తర్వాత ఆలూరు వై.జంక్షన సర్కిల్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజీలో పసుపు రంగులో ఉన్న ఓ ఆటో అనుమానస్పందంగా కనిపించింది. దానిపై ఉన్న నెంబరు కనిపించలేదు. అయితే ఆ ఆటోకు టైర్లు విచిత్రమైన సింబల్స్‌తో ఉన్నాయి. మరో బృందం, ఆదోని, ఎమ్మిగనూరు,మంత్రాలయం, బళ్లారి ఆలూరు తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలన్నింటనీ పరిశీలించారు. అదే సమయంలో మృతదేహం లభ్యమైన ప్రాంతంలో సెల్‌టవర్ డంప్, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కొన్ని అనుమానాస్పద ఫోన నెంబర్లను గుర్తించారు. ఇలా సెర్చ్ చేస్తున్న క్రమంలో ఆదోనిలోని సీసీ ఫుటేజీలో ఆలూరు వై.జంక్షన సీసీ కెమెరాలో ఉన్న ఆటోను పోలిన విచిత్రమైన సింబల్స్‌లో ఉన్న టైర్ల ఆటోను గుర్తించారు. దానిపైన ఉన్న రిజిస్ర్టేషన నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్‌ను వెతికి పట్టుకున్నారు. తనకు ఆ డ్రమ్ములో ఏముందో తెలియదు అని. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి కెమికల్ డ్రమ్ము అని చెప్పి ఆ డ్రమ్మును ఊరి చివరి పడేసి రావాలని ఆటోను బాడుగకు మాట్లాడుకున్నారనీ డ్రైవర్ వివరించాడు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌తో మాట్లాడిన సందర్భాలు సెల్ టవర్ డంప్‌ను కూడా పరిశీలించారు. ఆటో డ్రైవర్ వివరాల మేరకు ఓ మూడు సెల్ ఫోన నెంబర్లు కలిగిన వ్యక్తులు హలేబీడు, తుమ్మలబీడు, సూగూరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌సాయంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించి వారే నిందితులుగా గుర్తించారు.
ఫ డబ్బు కోసమే హత్య:
ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన పేటయ్య పొలం విక్రయించాడు. దానికి సంబందించి కొంత నగదు పేటయ్యకు వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన నరసింహులు ఆ డబ్బులను కాజేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. హోలేబీడుకు చెందిన హనుమంతు, పంపన్నల సాయం కోరాడు. జూలై 24న పేటయ్యను నమ్మించి ఆలూరు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో విషగులికలు వేసి పేటయ్యను హతమార్చారు. ఆ తర్వాత సమీపంలోని పొలం యజమాని సాయంతో పైపైనే శవాన్ని పూడ్చిపెట్టారు. రెండు రోజుల తర్వాత మృతేదేహం నుంచి దుర్వాసన రావడంతో పొలం యజమాని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో అతనికి రూ.50వేలు ఆశ చూపి మరో రోజు సమయం తీసుకుని ఓ డ్రమ్ము తీసుకువచ్చి మృతదేహాన్ని గుంతలో నుంచి బయటకు తీసి డ్రమ్ములో వేశారు. జూలై 27వ తేదీ డ్రమ్మును జాగ్రత్తగా సీల్ వేసి ఓ ఆటోను మాట్లాడుకుని ఆస్పరి సమీపంలో చిన్నహోతూరు సమీపంలో ఆ డ్రమ్మును పడేసి వెళ్లిపోయారు.
ఫ రెండు రోజుల్లో కేసును చేదించాం
- జి.బిందుమాధవ్, ఎస్పీ
పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహం కేసులో ఎలాంటి క్లూ లేకున్నా కూడా రెండు రోజుల్లో మా సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కేసు చేధించడం అభినందనీయం. ఈ కేసులో నిందితులను పట్టుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తి వివరాలు తెలిశాయి. సీఐ హనుమంతప్ప, సిబ్బంది ఈ కేసును చేధించడంలో ప్రధాన పాత్ర వహించారు. ఈ కేసు అవార్డుకు ఎంపిక కావడం భవిష్యత్తులో మరింత బాధ్యతను పెంచుతుంది. మున్ముందు అన్ని కేసుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని కేసులు చేధించేలా పూర్తి స్థాయి శిక్షణ కూడా ఇస్తున్నాం. సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో సీసీ కెమెరాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Updated Date - Dec 20 , 2024 | 11:49 PM