పాల ధర పెరుగుతుంటే.. నెయ్యి రేటు ఎలా తగ్గింది?
ABN, Publish Date - Oct 06 , 2024 | 04:32 AM
దేశవ్యాప్తంగా పాల ధర పెరుగుతుంటే టీటీడీ కొనుగోలు చేసే నెయ్యి రేటు ఎలా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
కమీషన్ల కోసం ట్రేడింగ్ కంపెనీలకు వైసీపీ నేతల ఆర్డర్లు
2019 నుంచీ తిరుమలలో ఇదే తంతు: నీలాయపాలెం ధ్వజం
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పాల ధర పెరుగుతుంటే టీటీడీ కొనుగోలు చేసే నెయ్యి రేటు ఎలా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ప్రశ్నించారు. సహకార పాల డెయిరీలను వదిలిపెట్టి కమీషన్ల కక్కుర్తితో వైసీపీ నేతలు ట్రేడింగ్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారని, దాని ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరా మొదలైందని ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడి తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కల్తీ దందా నడుస్తోందని చెప్పారు. ‘వైసీపీ నేతల కమీషన్ల దందాకు తట్టుకోలేక ఏపీ, కర్ణాటక డెయిరీలు నెయ్యి సరఫరా నుంచి తప్పుకొన్నాయి.
ఉత్తర భారత కంపెనీల హవా నడిచింది. గత ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల మేర నెయ్యి కొన్నారు. మాకున్న సమాచారం ప్రకారం ఈ కొనుగోళ్లలో 25 శాతం కమీషన్లు ముట్టాయి. చైౖర్మన్లు, ఈవోలు, ఇతర అధికారులు సిండికేట్‌గా మారి అయినకాడికి దోచుకున్నారు. వైసీపీ హయాంలో నెయ్యి టెండర్లు దక్కించుకొన్న కంపెనీల్లో సహకార డెయిరీ ఒక్కటీ లేదు. ఈ దోపిడీకి రివర్స్ టెండరింగ్‌ను ఒక ఆయుధంగా వాడుకొన్నారు’ అని ఆయన ఆరోపించారు. ‘కేవలం కొన్ని కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? అర్హత లేని ఏఆర్ డెయిరీకి టెండర్ ఎలా ఇచ్చారు? వైసీపీ హయాంలో ప్రతి 3 నెలలకు నెయ్యి ధరలో ఎందుకు తేడాలొచ్చాయి? అత్యధిక శాతం ఆర్డర్లు ఉత్తర భారత కంపెనీలకే ఎందుకు దక్కాయి? ఇంత వివాదం జరుగుతుంటే నాటి ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి సమాధానం చెప్పాలని విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
Updated Date - Oct 06 , 2024 | 04:32 AM