ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New DGP: కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ABN, Publish Date - Jun 20 , 2024 | 03:46 AM

డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది.

Dwarka Tirumala Rao

హరీశ్‌కుమార్‌ గుప్తా బదిలీ

హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియామకం

చంద్రబాబు ప్రమాణస్వీకారంలో జరిగిన గందరగోళమే కారణం!

నీరబ్‌ కుమార్ సర్వీస్‌ పొడిగింపు..!!

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి చంద్రబాబు సీఎం కాగానే.. ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారని అంతా భావించారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఈసీ తొలగించి హరీశ్‌కుమార్‌ గుప్తాను నియమించింది. ఆయననే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది.


కారణమిదే..?

ఆ రోజున ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి.. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీప్రమాణం చేయించాల్సిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయన కాన్వాయ్‌ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్‌ నియంత్రణలో విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్‌ కాన్వాయ్‌కు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై ప్రధాని మోదీ కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు తిరుగు ప్రయాణ సమయంలో తనకు వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఎవరు రావద్దని ఒక్కరే వెళ్లిపోయారు. అప్పుడే గుప్తాపై బదిలీ వేటు పడుతుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం కొన్నాళ్లు ఆగి బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో సమర్థుడు, నిజాయితీపరుడిగా పేరున్న 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమించింది.


ఆర్టీసీ ఎండీగా

ద్వారకా తిరుమల రావు ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కీలక పోస్టుల్లో పనిచేశారు. నిబద్ధత కలిగిన పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా డీజీపీని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం సమయం లేకపోవడంతో ప్రభుత్వం నియమించింది. నేరుగా డీజీపీ పోస్టు ఇవ్వకుండా డీజీపీ (కో-ఆర్డినేషన్‌) పోస్టులో నియమించింది. ఆ స్థానంలో ఉండి ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గుప్తాకు కూడా కీలకమైన హోం శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత అప్పగించింది.


ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐపీఎస్

గుంటూరు: సామాన్య కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి.. జాతీయస్థాయిలో సివిల్స్‌కు ఎంపికైన ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు. ఇప్పుడు డీజీపీగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. తిరుమలరావు గుంటూరు వాసి. దేవాపురంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారిగా పనిచేశారు. వారికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు, తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. కొంత కాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తిరుమల రావు భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. తిరుమలరావు చెన్నై సీబీఐలో కొంతకాలం పనిచేశారు. గుంటూరులో చిన్ననాటి నుంచి తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి.

Updated Date - Jun 20 , 2024 | 07:19 AM

Advertising
Advertising