YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ఫైర్
ABN, Publish Date - Sep 04 , 2024 | 06:22 PM
విపత్తు వేళ హూందాగా వ్యవహరించకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో జగన్ రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని హితబోధ చేశారు.
భీమవరం: విపత్తు వేళ హూందాగా వ్యవహరించకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో జగన్ రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని హితబోధ చేశారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ తీవ్రంగా వైఫల్యం చెందాడు కాబట్టే ఏపీ జనాలు 11 సీట్లతో సరిపెట్టారని చురకలు అంటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ పూర్తి సమయం వరద ప్రాంతాల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీపిస్తూనే ఉన్నారని ప్రస్తావించారు. విపత్తు సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పని చేయాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక సభ్యత్వం నమోదు కోసం కృషి చేస్తామని మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
అంటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి: టీజీ వెంకటేశ్
విజయవాడ నగరం వరదలతో అతలాకుతలమవుతోందని, దీని నుంచి ప్రజలను రక్షించడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంటకేశ్ అన్నారు. వరద ముంపు ప్రాంతంలో ఎటువంటి విష జ్వరాలు, అంటు రోగాలు రాకుండా సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, గతంలో వరద ప్రాంతాల్లో పనిచేసిన అధికారులను వారి అనుభవాలను సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులను ముంపు ప్రాంతాలకు తరలించి పారిశుధ్య లోపం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో వరదలు సంభవించినప్పుడు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. సభ్యత నమోదు కార్యక్రమం ప్రతి పార్టీలో ముఖ్యమైన ఘట్టమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా కింది స్థాయిలో కూడా నాయకులు చేయబోయే మంచి పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Updated Date - Sep 04 , 2024 | 06:30 PM