ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టిడ్కో గృహాలకువీడని గ్రహణం

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:55 AM

గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు వైపీపీ ప్రభుత్వంలో గ్రహణం పట్టింది. పేదోడి సొంతింటి కలను నాశనం చేసేలా అనేక నిర్ణయాలను జగన్‌ సర్కారు తీసుకుంది. రివర్స్‌ టెండరింగ్‌, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు అంటూ వివిధ కారణాలు చూపి పనులు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేసింది. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ఇళ్లు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.

- జిల్లాలో 13,712 గృహాల నిర్మాణం చేపట్టిన గత టీడీపీ ప్రభుత్వం

- వైసీపీ ప్రభుత్వం రాకతో ఎక్కడి పనులు అక్కడే నిలుపుదల

- ఉయ్యూరులో 2019 నుంచి చెల్లించని బిల్లులు

- గుడివాడ, మచిలీపట్నం, రుద్రవరంలో అసంపూర్తిగా పనులు

- ఇన్నేళ్లలో ఇప్పటి వరకు జిల్లాలో లబ్ధిదారులకు అప్పగించిన గృహాలు 8,176

- కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారుల ఆశలు

గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు వైపీపీ ప్రభుత్వంలో గ్రహణం పట్టింది. పేదోడి సొంతింటి కలను నాశనం చేసేలా అనేక నిర్ణయాలను జగన్‌ సర్కారు తీసుకుంది. రివర్స్‌ టెండరింగ్‌, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు అంటూ వివిధ కారణాలు చూపి పనులు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేసింది. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ఇళ్లు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహాలకు గ్రహణం వీడలేదు. జిల్లాలో 13,712 గృహాలను గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2019లో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ వివిధ కారణాలు చూపి పనులు నిలిపివేశారు. గుడివాడలో ఏడు వేల మందికి, మచిలీపట్నంలో 864 మందికి టిడ్కో గృహాలను అప్పగించారు. మచిలీపట్నం, రుద్రవరంలో టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. ఉయ్యూరులోని టిడ్కో గృహాల నిర్మాణం 2019 నుంచి నిలిచిపోయాయి. ఇక్కడ పనులు చేసే కాంట్రాక్టరుకు రూ.100 కోట్ల వరకు 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో పెట్టింది.

బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు

టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో గృహాలకు సంబంధించిన నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారుల వాటా చెల్లింపులు, వారి పేరున బ్యాంకు రుణాలు మంజూరు వంటి ప్రక్రియ జరిగింది. గత ఆరేడు సంవత్సరాల కిందటే లబ్ధిదారుల పేరున బ్యాంకు రుణాలు ఇవ్వడంతో బ్యాకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించాలని కోరుతూ లబ్ధిదారులకు బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. వివిధ బ్యాంకుల సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి టిడ్కో గృహాల నిర్మాణం నిమిత్తం తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. మాకు గృహాలు ఇంకా అప్పగించలేదు, రుణాలు ఎలా చెల్లిస్తామని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో వివిధ రూపాల్లో జమ అయిన నగదును టిడ్కో గృహం రుణం చెల్లింపుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకుంటుండటంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

గుడివాడలో మౌలిక సదుపాయాలు నిల్‌

గుడివాడ పురపాలక సంఘం సరిహద్దున ఉన్న మల్లాయపాలెంలో 8,912 గృహాలను నిర్మించారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక ఇందులో కొంతమంది లబ్ధిదారుల పేర్లను అకారణంగా తొలగించారు. 2022 జూన్‌ నెలలో లబ్ధిదారులకు గృహాలు అప్పగించగా, వీరిలో రెండు వేల కుటుంబాలు కూడా నివాసం ఉండటంలేదు. తాగునీరు, ఇతర మౌలిక వసతులు ఇక్కడ లేకపోవడంతో నివాసం ఉండటానికి ప్రజలు ముందుకురావడంలేదు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నవారికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఒక కాంప్లెక్స్‌లో లబ్ధిదారులు నివాసం ఉంటే వారంతా నీటి అవసరాల కోసం బోర్లు వేయించుకుంటున్నారు. తక్కువ మంది ఒక కాంప్లెక్స్‌లోనివాసం ఉంటే బోర్లు వేసేందుకు ముందుకురావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కారణాలతో రెండు వేల మంది లబ్ధిదారులకు గృహాలు అప్పగించకుండా తొక్కిపెట్టారు. ఈ గృహాలను ఎవరికి కేటాయిస్తారనే అంశంపై నేటికీ స్పష్టతలేదు. ఎన్నికల సమయంలో టిడ్కోగృహాల రుణాల నుంచి లబ్ధిదారులకు విముక్తి కల్పిస్తామని రెండు ప్రధాన పార్టీల నాయకులు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడటం లేదు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

మచిలీపట్నంలో అసంపూర్తి పనులతో అవస్థలు

మచిలీపట్నంలో టీడీపీ ప్రభుత్వంలో ఆరు వేల మంది లబ్ధిదారులు టిడ్కో గృహాల కోసం నగదు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గృహాల సంఖ్యను 2,304 తగ్గించింది. మచిలీపట్నంలో గో సంఘం వద్ద 864 గృహాలను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులకు అప్పగించారు. 500 కుటుంబాలవారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకు ద్వారా తాగునీరు సక్రమంగా అందనిస్థితి నెలకొంది, ఇక్కడ వీధిలైట్లు వేయకపోవడంతో రాత్రి సమయంలో ఈ గృహ సముదాయాలలో నివాసం ఉండే కుటుంబాలు పలు ఇక్కట్ల పాలవుతున్నాయి. పారిశుద్ధ చర్యలు శూన్యం. ఈ గృహ సముదాయం వద్ద మురుగునీటిని బయటకు పంపేందుకు డ్రెయిన్‌ల పనులు అసంపూర్తిగానే చేశారు.

రుద్రవరంలో బిల్లుల పెండింగ్‌తో నిలిచిన పనులు

మచిలీపట్నం నియోజకవర్గంలోని రుద్రవరంలో ముందుగా మూడు వేలకుపైగా టిడ్కో గృహాల నిర్మాణం కోసం పునాదులు వేశారు. వివిధ కారణాలతో ఈ గృహాల సంఖ్యను 1,440 కుదించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో గతంలోనే ఇక్కడ 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు ఈ పనులను నిలిపివేసింది ఇక్కడి గృహాలకు సంబంధించి గదులకు కిటికీలు, డోర్‌లు, విద్యుత పనులు నిలిచిపోయాయి. ఈ గృహ సముదాయాలకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3.50 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఈ బిల్లులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్‌ చెబుతున్నట్లు టిడ్కో అధికారులు చెబుతున్నారు. ఇక్కడి గృహాలకు తాగునీటి అవసరాల నిమిత్తం నగరంలోని పంపుల చెరువు నుంచి పైప్‌లైన్‌ వేశారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకు, సంప్‌ల నిర్మాణ పనులు పూర్తయినా సగం గృహాలకు మాత్రమే పైప్‌లైన్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఎప్పటికి ఈ గృహాలను లబ్ధిదారులకు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఉయ్యూరులో పెండింగ్‌ బిల్లులు రూ.వంద కోట్ల పైనే

పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు టౌన్‌ పరిధిలోని జెమిని స్కూల్‌, ఎగినపాడు రహదారి పక్కన, గండిగుంట పంచాయతీ పరిధిలో టిడ్కో గృహాల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వ ప్రారంభించింది. ఎల్‌అండ్‌టీ కంపెనీ ద్వారా ఈ పనులు చేస్తున్నారు. ఇక్కడి గృహాలకు రూ.100 కోట్లకుపైగా బిల్లులను గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. ఎన్నికల ముందు ఈ గృహ సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామని అప్పటి పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌ కొద్దిరోజుల పాటు హడావుడి చేశారు. రహదారుల పనులను కొంతమేర చేసినట్లుగా చూపి అనంతరం నిలిపివేశారు. 2019 నుంచి ఇక్కడి పనులు పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. లబ్ధిదారులకు గృహాలు ఇవ్వకపోయినా, గృహనిర్మాణం నిమిత్తం తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 01:56 AM