ఉపాధి సిబ్బందికి శిక్షణ
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:01 AM
ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సిబ్బందికి శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరముందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు భావిస్తున్నారు.
జనవరి నుంచి ప్రారంభించాలనే యోచన
కూలీలకు రూ.300 వేతనం లభించేలా చర్యలు
శ్రమశక్తి సంఘాలకు మళ్లీ జీవం..
ఇప్పటికే వేతనాల మానిటరింగ్ సెల్ ఏర్పాటు
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే సిబ్బందికి శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరముందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు భావిస్తున్నారు. జనవరి నుంచి సిబ్బందికి పనుల నిర్వహణపై నిపుణులతో శిక్షణ ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉపాధి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. పలు చోట్ల కూలీలకు రూ.150ల నుంచి రూ.190 వరకు వేతనాలు మాత్రమే అందుతుండటం, కొన్ని చోట్ల పనులు లేకుండానే జరిగినట్లు మస్టర్లు వేయడం తదితర అంశాలను గమనించారు. గత ఐదేళ్లుగా ఉపాధి పథకం గాడితప్పడంతో సిబ్బంది కూడా పథకం లక్ష్యం విస్మరించారని, వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం ద్వారా పథకాన్ని గాడిన పెట్టాలని నిర్ణయించారు. గతంలో ఉపాధి పథకం ద్వారా ఏటా మేట్లకు, కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, మండలస్థాయి సిబ్బందితో పాటు అన్ని స్థాయిల్లో శిక్షణ ఇచ్చేవారు. ఈ ఐదేళ్లూఎక్కడా అలాంటి శిక్షణలు నిర్వహించలేదు. దీంతో పాటు గతంలో శిక్షణ పొందిన ఫీల్డ్ అసిస్టెంట్లను రకరకాల కారణాలతో తొలగించడంతో, మిగిలిన సిబ్బందికి ఈ పథకం అవగాహన లేక పనుల స్ఫూర్తి దెబ్బతిందన్న అభిప్రాయం ఏర్పడింది.
మళ్లీ శ్రమశక్తి సంఘాలు
గతంలో శ్రమశక్తి సంఘాలు(ఎ్‌సఎ్‌సఎ్‌స)గా 20 నుంచి 40 మంది కూలీలతో గ్రూపులు ఏర్పాటుచేసి వాటికి మేట్‌లను నియమించేవారు. ఆ మేట్‌లకు ప్రతి ఏడాదీ శిక్షణ అందించేవారు. ఆయా గ్రూపులుగా కొన్ని నిర్దిష్టమైన పనులు నిర్వహించేవారు. దీంతోపాటు పనుల కోసం కూలీలను తీసుకొచ్చేవారు. మేట్‌లందరూ ఫీల్డ్ అసిస్టెంట్లకు సహాయకారిగా ఉండటంతో పథకం సజావుగా, పారదర్శకంగా సాగేది. గత ఐదేళ్లు ఈ మేట్‌లకు ట్రైనింగ్ ఇవ్వకపోవడమే కాకుండా శ్రమశక్తి సంఘాలు కూడా కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఉపాధి పనులు సక్రమంగా జరగడానికి, కూలీలకు రూ.300లు వేతనం అందడానికి సిబ్బందితో పాటు శ్రమశక్తి సంఘాలను తిరిగి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అంతే కాకుండా మండలస్థాయి సిబ్బందికి కూడా మారుతున్న కాలాన్ని బట్టి వారి జాబ్‌చార్ట్‌పై శిక్షణ ద్వారా సరైన అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
వేతన మానిటరింగ్ సెల్ బలోపేతం
కూలీలకు రూ.300లు వేతనం దక్కేలా రాష్ట్ర వ్యాప్తంగా వేతన మానిటరింగ్ సెల్స్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. విజిలెన్స్ అధికారులను పూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి కూలీలను, సిబ్బందిని కార్యోన్ముఖులుగా చేయాలని భావిస్తున్నారు. అలాగే, పని ప్రదేశాల్లో సౌకర్యాలతో పాటు ఫస్ట్ ఎయిడ్‌బాక్స్, తాగునీటి సౌకర్యాలు తదితర అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో చేపట్టే పనులు కూడా ఆస్తులుగా మిగిలిపోయేవిగా ఉండాలని, వాటితో స్వయం సమృద్ధి సాధించేలా ఉండాలని భావిస్తున్నారు. తిరిగి ఉన్నతి కార్యక్రమం ద్వారా ఉపాధి కూలీల కుటుంబాలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటారు.
Updated Date - Dec 26 , 2024 | 05:01 AM