Transgender Leader : ఆధిపత్య పోరుతోనే హాసిని హత్య
ABN, Publish Date - Dec 02 , 2024 | 05:05 AM
ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే హిజ్రాల సంఘం నాయకురాలు మానికల హాసిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులో 15మంది నిందితులను గుర్తించామని, వారిలో 12మందిని అరెస్టు చేశామని తెలిపారు.
చంపేందుకు రూ.20 లక్షల సుపారీ
ట్రాన్స్‌జెండర్ల మధ్య పాత కక్షలు
12 మంది నిందితుల అరెస్టు.. పరారీలో ముగ్గురు
వివరాలు వెల్లడించిన నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు క్రైం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలోనే హిజ్రాల సంఘం నాయకురాలు మానికల హాసిని హత్య జరిగిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఈ కేసులో 15మంది నిందితులను గుర్తించామని, వారిలో 12మందిని అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఉమే్‌షచంద్ర కాన్ఫెరెన్స్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ల నాయకురాలు అలేఖ్య, మరికొందరు ఆధిపత్య పోరులో భాగంగా హాసినిపై పగ పెంచుకున్నారని పేర్కొన్నారు. వారి మధ్య గతంలోనూ విభేదాలు, గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలో చింతల భూపతి, సురేంద్ర అనే రౌడీషీటర్లకు రూ.20 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించారని తెలిపారు. నవంబరు 26 రాత్రి విడవలూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న హాసినిని.. టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిందితులు అడ్డుకొని, విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారని చెప్పారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించారని తెలిపారు. కోవూరు అండర్ బ్రిడ్జి వద్ద రెండు కార్లలో వెళ్తున్న 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు.
Updated Date - Dec 02 , 2024 | 05:05 AM