YSRCP: వైసీపీకి ఊహించని షాక్..
ABN, Publish Date - Aug 06 , 2024 | 09:53 AM
కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయారట.
కాకినాడ: కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి రాజీనామా చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయారట. వైసీపీకి రాజీనామాపై ముఖ్య నాయకులకు ఇప్పటికే పెండెం దొరబాబు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడనున్నారు. వీరంతా బుధవారం రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ సీటును దొరబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ను వంగా గీతకు కేటాయించారు. పవన్ చేతిలో గీత ఘోర పరాజయం పాలయ్యారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్‌పై పోటీకి సిద్ధమైన దొరబాబే.. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లేందుకు ఉత్సాహం ప్రదర్శించడం.
పుట్టినరోజు సందర్భంగా..
పెండెం దొరబాబుకు ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని వైసీపీ అధినేత జగన్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో దొరబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇటీవల జగన్ ఢిల్లీ ధర్నాకు దొరబాబు మొహం చాటేశారు. జనసేనలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం దొరబాబు తన పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్‌లో ఎక్కడా కూడా వైసీపీ జెండా కానీ జగన్ ఫోటో కానీ ఎక్కడా కనిపించలేదు. అప్పటి నుంచే దొరబాబు పార్టీ మారతారంటూ బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. అప్పుడే అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అప్పుడు ఎందుకో దొరబాబు ఆగిపోయారు. మొత్తానికి ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది.
ఎవరి దారి వారు..
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అధినేత జగన్ కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం జనాల వద్దకు వెళుతున్నదీ లేదు. ఓడిపోయిన నేతలను పరామర్శిస్తున్నదీ లేదు. పూర్తిగా బెంగుళూరు ప్యాలెస్‌కే పరిమితమవుతున్నారు. ఏపీకైతే కేవలం గెస్ట్‌గా వచ్చి వెళుతున్నారంతే.. ఆ మధ్య ఏపీలో జరుగుతున్న అల్లర్లపై ఢిల్లీలో ఆందోళన చేసి వచ్చారు. దీనిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో కేడర్‌ను కాపాడుకోకుండా ఢిల్లీలో ధర్నాలేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నించారు. జగన్ అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దొరబాబుతోనే జంపింగ్స్ ఆగేలా కనిపించడం లేదు. వరుస కొనసాగడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. దొరబాబు తర్వాత ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Updated Date - Aug 06 , 2024 | 10:02 AM