AP Assembly Session: జగన్ బాధితులూ లేచి నిలబడండి
ABN, Publish Date - Jul 26 , 2024 | 02:52 AM
గత జగన్ సర్కారు బాధితుల్లో సామాన్యులే కాదు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్.. ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా
అసెంబ్లీలో చంద్రబాబు సూచన
నిలబడ్డ 90% ఎమ్మెల్యేలు
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గత జగన్ సర్కారు బాధితుల్లో సామాన్యులే కాదు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్.. ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ బాధితుల్లో తాను, పవన్, స్పీకర్, అచ్చెన్న, నారాయణ, లోకేశ్, ఇతర మంత్రులు ఉన్నారంటూ పేర్లు ప్రస్తావిస్తూ సభ్యుల వైపు చూశారు. ఈ సందర్భంగా ‘నేను, నేను’.. అంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తారు. దీంతో ‘జగన్ ప్రభుత్వంలో శారీరక, మానసిక, ఆర్థిక పరమైన వేధింపులకు గురై అక్రమ కేసుల్లో చిక్కుకున్న బాధితులు ఒకసారి లేచి నిల్చోండి’ అని చంద్రబాబు అన్నారు.
దీంతో పవన్, లోకేశ్, మంత్రులు సహా 90 శాతం మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. చంద్రబాబు చేసిన పని సభలో నవ్వులు పూయించింది. చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన వీళ్లపైనే గాక కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో పెళ్లికో, ఫంక్షన్‌కో పిలిచినట్లు ఇంట్లో ఉన్నోళ్లందరూ రావాలంటూ 41ఏ నోటీసులు ఇచ్చారన్నారు.
మంత్రి నారాయణ, ఆయన భార్య, అల్లుడు, కూతురుకు కూడా నోటీసులు ఇచ్చారన్నారు. ‘అత్యధికంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, చింతమనేని ప్రభాకర్‌పై 48, పులివర్తి నానిపై 31 కేసులున్నాయి. కేసుల్లో వీరు మొదటి స్థానాల్లో ఉన్నారు. నాపై 17, లోకేశ్‌పై 17, మీ (స్పీకర్)పై 17, పవన్ కల్యాణ్‌పై 7 కేసులు ఉన్నాయి. ఇంకా అచ్చెన్న, నారాయణ, కొల్లు రవీంద్ర, రఘురామ తదితరులపై కేసులు పెట్టారు’ అని పేర్లు చదివారు. ‘ఇవన్నీ మనందరి ర్యాంకులు అధ్యక్షా’ అని అనడంతో మరోసారు నవ్వులు విరబూశాయి. కేసుల్లేని వారు అదృష్టవంతులంటూ ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దీంతో మీరు (కేసులు లేనివారు) కూడా లేచి నిలబడండి అని ముఖ్యమంత్రి సూచించారు. పదిశాతం మంది సభ్యులు కూడా లేచి నిలబడలేదు. వారిని ఉద్దేశిస్తూ ‘నిజంగా వీళ్లు అదృష్టవంతులే’ అని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు. అక్రమ కేసులపై సమీక్షించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 07:15 AM