YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు
ABN, Publish Date - Sep 13 , 2024 | 02:34 PM
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ వీడేందుకు దాదాపుగా సిద్దమైనట్లు సమాచారం. అందులోభాగంగా ఒంగోలులోని తన వైసీపీ కార్పొరేటర్లు, తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ వీడకుండా బాలినేని ఉండేందుకు మాజీ మంత్రి విడదల రజినీని మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపారు.
ఒంగోలు, సెప్టెంబర్ 13: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆ పార్టీలోని అసంతృప్తి నేతలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వడం లేదు. తాజాగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతోంది. వైసీపీని వీడేందుకు ఆయన నిర్ణయించుకున్నారనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తుంది.
అందులోభాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తన భవిష్యత్తు కార్యాచరణను కార్పొరేటర్లతోపాటు తన ముఖ్య అనుచరులకు ఈ సందర్భంగా బాలినేని వివరించారు. దీంతో బాలినేనితో రాయబారం నెరపడానికి మాజీ మంత్రి విడదల రజినీతోపాటు సతీష్ రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దింపారు. దీంతో హైదరాబాద్‌లోని బాలినేని నివాసంలో ఆయనతో వారిద్దరు చర్చలు జరుపుతున్నారని సమాచారం.
Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం
మరోవైపు బుధవారం సాయంత్రం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమైనట్లు ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ బాలినేనిని వైఎస్ జగన్ కోరగా.. అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పార్టీ అధికారంలో ఉండగా.. తనను పక్కన పెట్టిన తీరును పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందు బాలినేని ఉంచినట్లు సమాచారం.
గతంలో పక్కన పెట్టి.. పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేని వేళ.. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ తన అసంతృప్తిని మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట బాలినేని వెళ్లగక్కినట్లు తెలుస్తుంది. పార్టీ వీడాలని తాను కృత నిశ్చయంతో ఉన్నట్లు ఈ భేటీలో వైఎస్ జగన్ ఎదుట బాలినేని కుండ బద్దలు కొట్టారని ఓ ప్రచారం సైతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విడదల రజినీతోపాటు సతీష్ రెడ్డిని బాలినేనితో చర్చించేందుకు రాయబారానికి పంపినట్లు సమాచారం.
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 13 , 2024 | 04:17 PM