ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Floods: తీరని కష్టం!

ABN, Publish Date - Sep 06 , 2024 | 03:58 AM

చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది!

  • వరద బాధితుల దయనీయ గాథలు

  • సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు, కష్ట జీవులు

  • ఇళ్లలోని వస్తువులన్నీ వరదకు ధ్వంసం

  • మళ్లీ కుదుటపడటం కష్టమని కన్నీళ్లు

  • 1,000 కోట్లు సగం ప్రభుత్వ శాఖల పరిధిలో నష్టం ప్రాథమిక అంచనా

33 మృతుల సంఖ్య

275 పశువుల మృతి

3,756 కి.మీ. దెబ్బతిన్న రోడ్లు

5.02 లక్షల ఎకరాలు పంట నష్టం

214 పునరావాస శిబిరాలు

45,369 శిబిరాల్లోని బాధితులు

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది! వరద తగ్గుముఖం పట్టిన తర్వాత... తమ ఇళ్లు, దుకాణాల తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం వీరిని హతాశులను చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ! గురువారం నాటికి సింగ్‌ నగర్‌ ప్రధాన రహదారుల్లో వరద దాదాపు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వాంబే కాలనీ, సుందరయ్య నగర్‌, రాజీవనగర్‌, కండ్రిక, పాతపాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నడుం లోతు నీళ్లు ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యాపారులు షట్టర్లు ఎత్తి వరద కారణంగా తడిచి ముద్దయిన వస్తువుల్లో పనికి వచ్చే వస్తువులను ఆరబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రిజ్‌, టీవీ, వాషింగ్‌ మెషిన్‌, కూలర్‌, ఏసీల వంటి ఉపకరణాలు నీళ్లలో మునిగిపోయాయి. ఎలకా్ట్రనిక్‌ వస్తువులు తిరిగి పనిచేసే అవకాశమే లేదు. కొంతమంది ఇళ్లలో ఖరీదైన ఫర్నీచర్‌ కొట్టుకుపోయింది. రెండు మూడు రోజులపాటు నీళ్లలో నానడంతో ఇంట్లో ఉన్న వస్తువులేవీ పనికొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక బైకులు, కార్ల సంగతి సరేసరి! వేల వాహనాలు ఇప్పుడు షెడ్డుకు వెళ్లక తప్పదు.


కళ్ల నీళ్లు...

పఠాన్‌ అస్మాన్‌ ఖాన్‌ అజిత్‌సింగ్‌ నగర్‌ వాసి. పైపుల రోడ్డులో రిజ్వాన్‌ ఆప్టికల్స్‌ పేరుతో కళ్లజోళ్ల షాపు నడుపుతున్నారు. అందులోనే కంటి పరీక్షలు చేసే కంప్యూటరైజ్డ్‌ మిషన్‌ కూడా ఉంది. ఈ షాపే ఆయన జీవనాధారం. బుడమేరు వరదతో షాపు మొత్తం నీట మునిగింది. వరద నీరు తగ్గడంతో గురువారం షాపు తెరిచారు. మిషన్లను, కళ్లజోళ్లను, ఫ్రేములను బురద కమ్మేసింది. ఈ పరిస్థితి చూసి అస్మాన్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి.

కొన్నేళ్ల కష్టం.. వరదపాలు

పెద్ది ఉమామహేశ్వరరావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా సంతగడు మండలం. ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం విజయవాడకు వచ్చారు. కార్పెంటర్‌ పని చేసుకుంటూ వాంబేకాలనీ ‘ఎ’ బ్లాక్‌ వీధిలో రెండు గదుల ఇంటిని కొని సొంత గూడును ఏర్పాటు చేసుకున్నారు. బుడమేరు వరద ఆ ఇంటిని ముంచేసింది. బీరువా, ఫ్రిజ్‌, కూలర్‌, వాషింగ్‌ మిషన్‌ అన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద నీరు రావడంతో నాలుగు రోజులపాటు మేడ మీద ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు.. గురువారమే కిందికి దిగారు.


సర్వం కోల్పోయాం: నాగలక్ష్మి, వాంబేకాలనీ

మాది చిన్న కుటుంబం. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాం. వాంబే కాలనీలో అద్దెలు తక్కువ కావడంతో కొద్ది నెలల కిందటే ఇక్కడికి వచ్చాం. కింది అంతస్తులో నివాసం ఉంటున్నాం. వరద చుట్టుముట్టడంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వదిలేసి... కట్టుబట్టలతో మొదటి అంతస్తులోకి వెళ్లిపోయాం. నాలుగు రోజుల తర్వాత కిందికి దిగాం. మా ఇల్లు ఇంకా నీటిలోనే ఉంది. జీవనోపాధి కోసం కొన్నాళ్ల కిందటే కొన్న పిండి గ్రైండర్‌ పాడైపోయింది. వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. మళ్లీ వీటిని సమకూర్చుకోవడం మామావల్ల కాదు.

పైసాపైసా పోగేసుకుని...

తమ్మిన రమేశ్‌... రోజువారీ కూలీ. భార్య ఇద్దరు పిల్లలు. సింగ్‌నగర్‌ ఫైవోవర్‌ దిగువన ఉన్న రైతు బజార్‌ వెనుకే నివసిస్తున్నారు. పైసాపైసా దాచుకుని కూడబెట్టుకున్న వస్తువులన్నీ బుడమేరు వరదకు నాశనమైపోయాయి. చివరికి ఇంజనీరింగ్‌ చదివే బిడ్డ పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ కూడా పాడయ్యాయి. సంవత్సరాల తరబడి కష్టపడి కూడబెట్టుకున్నవన్నీ వరదపాలయ్యాయని రమేశ్‌ కుటుంబం వాపోతోంది.

షాపు, ఇల్లూ ధ్వంసం...

ఆయన పేరు అద్దంకి అప్పారావు. విజయవాడ రాజీవ్‌నగర్‌లో రేషన్‌షాపు డీలర్‌. ఈయన దివ్యాంగుడు. ఈయన భార్య కూడా దివ్యాంగురాలే. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చిన్న ప్రవాహంగా బుడమేరు వరద మొదలైంది. వారున్న వీధి చివరే వీరి రేషన్‌షాపు ఉంటుంది. షాపు లోతట్టున ఉండటంతో... వరద నుంచి కాపాడుకునేందుకు బియ్యం బస్తాలను ఇంట్లోని గదిలోకి మార్పించారు. దీని కోసం కూలీలకు రూ.6 వేల వరకు ఖర్చు పెట్టారు. తీరా చూస్తే ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది. రేషన్‌ బియ్యం మొత్తం తడిసిపోయాయి. ఆయన నివాసంలో కట్టుకునే బట్టలు కూడా లేకుండా మొత్తం బురదమయమైపోయాయి.

Updated Date - Sep 06 , 2024 | 07:30 AM

Advertising
Advertising