ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : నైరుతి..తీరు మారింది

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:27 AM

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.

  • రోజుల తరబడి ఉండే ముసురు కనుమరుగు

  • అన్ని ప్రాంతాలకూ విస్తరించే వర్షాలూ మాయం

  • ఒకచోట అతివృష్టి, మరోచోట అనావృష్టి

  • ఆగస్టులో అనేక జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు

  • సముద్రాలు, భూమి, ఉపరితలం వేడెక్కడమే కారణం

  • ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఖరీఫ్‌పై ప్రతికూల ప్రభావం

  • వర్షం నీటిని నిల్వ చేసుకోవడం తప్పనిసరి చేయాలి

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితి మాయమైంది. ఇది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రుతుపవనాల సీజన్‌లో ఆగస్టును అత్యంత కీలకమైన నెలగా పరిగణిస్తారు. ఖరీఫ్‌ పంటలకు దోహదం చేసేలా ముసురుపట్టి వర్షాలు కురవాలి. కానీ, ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం కలిగేలా వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

మిగులు వర్షపాతం నమోదైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండున్నర నెలల కాలాన్ని పరికించి చూస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని స్పష్టమవుతుంది. వర్షాలకు భూమి, ఆకాశం, సముద్రాలు సహకరించాలి. అంటే మూడింట మధ్య ఏర్పడే తేడాల ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ, ఈ మూడూ వేడెక్కడంతో సమతుల్యత తప్పింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో సగటున ప్రతి వారం ఒక అల్పపీడనం ఏర్పడాలి.


సీజన్‌ మొత్తం ఆరేడు వాయుగుండాలు రావాలి. కానీ, పది రోజులక్రితం భూమిపై అల్పపీడనం ఏర్పడగా, మళ్లీ శుక్రవారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. ఈ నెలలో గత 16 రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండడం ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపింది. వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకునే నైరుతి రుతుపవనాల తీరు మారిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


వేసవి ఛాయలు..

రాష్ట్రంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆగస్టులో వేసవి ఛాయలు నెలకొన్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత ఉంటున్నాయి. అసలైతే ముసురు వాతావరణంతో ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోవాలి. కానీ, గత 16 రోజుల్లో రెండు, మూడు రోజుల తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నాలుగైదు రోజులు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదయ్యాయి. రానురాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తేడా మరింత ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది పంటలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. రోజుల తరబడి పొడి వాతావరణం నెలకొనడంతో పంటల ఎదుగుదల, మనుగడ ఇబ్బందిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.


రాష్ట్రంలోని 54 మండలాల్లో వర్షాభావం..

నైరుతి సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని 54 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 242 మండలాల్లో మిగులు వర్షాలు, 328 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

మొత్తం 670 మండలాల్లో 345.9 మి.మీ.కుగాను 403.9 మి.మీ(సాధారణం కంటే 16.7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో 10, శ్రీకాకుళంలో 7, ఒంగోలులో 6, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నాలుగేసి మండలాల్లో వర్షాభావం కొనసాగుతోంది.

కొన్ని జిల్లాల్లో ఒకటి నుంచి మూడు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టులో గడచిన 16 రోజుల్లో మూడు రోజులు తప్ప మిగిలిన 13 రోజుల్లో సాధారణం కంటే 20 నుంచి 80 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లో సాఽధారణం కంటే చాలా ఎక్కువగా, మరికొన్నిచోట్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది.

కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. ఐఎండీ నివేదిక ప్రకారం గతవారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొంతమేర లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని, నైరుతి ప్రారంభ నెల జూన్‌లో ఎక్కువ రోజులు, అలాగే, ఆగస్టు తొలి పక్షంలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో వర్షాభావం నెలకొందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


నీరు నిల్వ చేసే విధానం తేవాలి..

పండిన పంటను ఏడాదికి సరిపడేలా రైతులు ఇళ్లలో, గాదెల్లో భద్రపరుచుకుంటారు. ఇదే విఽధానం ఇప్పుడు నీటి నిల్వ కోసం అమలుచేయాల్సి అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే నాలుగు నెలల నైరుతి సీజన్‌లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య తగ్గుతోందని, ఒకవేళ కురిసినా భారీవర్షాలే తప్ప చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే తీరు ఇప్పుడు మాయమైందని పేర్కొన్నారు.

పడిన వర్షం నీటిని ఒడిసిపట్టి ప్రతి గ్రామంలో ఒకచోట నిల్వ చేసుకునేలా చెరువులు, కుంటల ఏర్పాటు తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, లేకపోతే నీటికి కటకట తప్పదని హెచ్చరించారు.


వేడెక్కిపోతున్న సముద్రం, భూమి, ఉపరితలం..

రుతుపవనాల సీజన్‌లో ఒక వారం వర్షాలు కురిస్తే, మరో వారం కొంత వరకు పొడి వాతావరణం ఉంటుంది. అంటే వర్షం పడిన తరువాత సముద్రంలో తిరిగి తేమ తయారీకి వారం పడుతుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. భూమి, సముద్రం, వాతావరణం మూడూ కూడా వేడెక్కిపోతున్నాయి. సాధారణంగా భూమి వేడెక్కినప్పుడు సముద్రం చల్లగా ఉంటే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ మూడు వేడెక్కడంతో పరిస్థితి భిన్నంగా తయారైంది.

ఒకవేళ మేఘాలు ఆవరించినా అవి ముక్కలై ఒక వైపు భారీ వర్షం కురిస్తే మరోవైపు పొడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌లలో వరదలు సంభవించగా మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం లేదా అనావృష్టి కొనసాగుతోంది. చివరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు తక్కువగా ఏర్పడుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతోనే రుతుపవనాల కాలంలో అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి.

-ఆచార్య సునీత, ఏయూ ఓషనోగ్రఫీ,

మెట్రాలజీ విభాగాధిపతి

Updated Date - Aug 19 , 2024 | 07:44 AM

Advertising
Advertising
<