ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి జోరు...వైసీపీ బేజారు

ABN, Publish Date - Dec 29 , 2024 | 01:14 AM

ఐదేళ్లకొకసారి జరిగే సాధారణ ఎన్నికలు 2024లో రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

  • కాల చక్రం - 2024

  • జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రం

  • సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలతో కూడిన కూటమి క్లీన్‌ స్వీప్‌

  • అందరికీ భారీ మెజారిటీలు

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు

  • ప్రభుత్వ విప్‌గా గణబాబు

  • పలువురికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు

  • మరోవైపు నేతల రాజీనామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి

  • ఇప్పటికే ముత్తంశెట్టి, ఆడారి గుడ్‌బై

  • జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల మార్పు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లకొకసారి జరిగే సాధారణ ఎన్నికలు 2024లో రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితికి చేరగా, విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనూహ్య విజయాన్ని సాధించి అధికార పగ్గాలు చేపట్టాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. విశాఖ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం తన ఖాతాలో వేసుకుంది.

ఓడలు బళ్లు...బళ్లు ఓడలు

ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు 2019లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నగరంలోని నాలుగు (తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ) నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, మిగిలిన 11 (భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, అరకు, పాడేరు) స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను వైసీపీయే గెలుచుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయనగా వైసీపీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్తను మార్చింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. మరోవైపు వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు బయటకు వచ్చి జనసేనలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేశ్‌కుమార్‌తో సఖ్యత కుదరక బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు.

రసవత్తరంగా ఎన్నికలు

మార్చి నెలలో ఎన్నికల ప్రకటన రాగానే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం జిల్లాలను పునర్విభజన చేయడంతో విశాఖ జిల్లాలో ఒక ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. ఆయనపై అంతకు ముందు ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీభరత్‌ తెలుగుదేశం పార్టీ తరఫున మళ్లీ 2024 ఎన్నికల్లోను ఎంపీగా పోటీ చేశారు. నాటి మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలిపింది. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకజవర్గాల్లోను కూటమి అభ్యర్థులే గెలిచారు. తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు (టీడీపీ), పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు (టీడీపీ), ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్‌రాజు (బీజేపీ), దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (జనసేన), గాజువాకలో పల్లా శ్రీనివాసరావు (టీడీపీ), భీమిలిలో గంటా శ్రీనివాసరావు (టీడీపీ), పెందుర్తిలో పంచకర్ల రమేశ్‌బాబు (జనసేన) భారీ మెజారిటీతో గెలిచారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఓటమి ఎరుగకుండా వరుసగా ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలిలో గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. మంత్రిగా ఉంటూ గాజువాక నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్‌నాథ్‌ టీడీపీ అభ్యర్థి పల్లా చేతిలో చిత్తయిపోయారు. గతంలో అనకాపల్లి నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనందకుమార్‌ ఈసారి వైసీపీ తరపున విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి అపజయం చెందారు.

ఎన్నికల తరువాత

ఎన్నికలు ముగిసి ఆరు నెలలైంది. ఈమధ్య కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఎమ్మెల్యే గణబాబుకు విప్‌గా అవకాశం ఇచ్చారు. ఇంకా కూటమి నాయకులు అనేక మందికి కార్పొరేషన్‌ పదవులు లభించాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, దక్షిణ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌కు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవి లభించింది. జనసేన నాయకుడు శివశంకర్‌కు చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. విశాఖ డెయిరీపై తెలుగుదేశం నాయకులు విచారణ కోరడం, సభా సంఘం వేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆడారి ఆనందకుమార్‌ టీడీపీలోకి రావాలని ప్రయత్నించారు. అవకాశం లభించకపోవడంతో బీజేపీ కండువా కప్పుకున్నారు. దీనికి రెండు వారాల ముందు భీమిలి మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఇదిలావుండగా వైసీపీ జిల్లా అధ్యక్షునిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌ను నియమించింది. అలాగే ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బాధ్యతల నుంచి వైవీ సుబ్బారెడ్డిని తప్పించి మళ్లీ విజయసాయిరెడ్డికి అప్పగించింది. స్థానిక సంస్థల కోటా నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Updated Date - Dec 29 , 2024 | 01:14 AM