ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార పదవులకు పోటీ

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:53 AM

సహకార శాఖ పరిధిలో గల డీసీసీబీ, డీసీఎంఎస్‌లతోపాటు ప్రాథమిక సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జుల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి పదవికి రేస్‌లో టీడీపీ నుంచి లాలం భవానీ, గవిరెడ్డి రామానాయుడు, కోట్ని బాలాజీ, కిలపర్తి భాస్కరరావు

మరికొందరు కూడా యత్నం

ప్రాథమిక సహకార

సంఘాలకు త్వరలో పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు...జాబితాల తయారీలో ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

సహకార శాఖ పరిధిలో గల డీసీసీబీ, డీసీఎంఎస్‌లతోపాటు ప్రాథమిక సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జుల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకూ నామినేటెడ్‌ పాలక వర్గాలను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి సంకేతాలు రావడంతో కూటమి పార్టీల నేతల్లో పదవుల కోసం పోటీ నెలకొంది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెట్‌ సోసైటీ (డీసీఎంఎస్‌) పర్సన్‌ ఇన్‌చార్జి పదవులకు తెలుగుదేశం నుంచి పలువురు పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాలం భవానీ, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, అనకాపల్లికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, దేవరాపల్లి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు రేస్‌లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును లాలం భవానీ కలిసి డీసీసీబీ చైర్మన్‌ పర్సన్‌ ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై ఆమె ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలను కలిశారు. భవానీ ఎలమంచిలి నియోజక వర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు లాలం భాస్కరరావు సతీమణి. గతంలో ఆమెకు జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు భాస్కరరావు కన్నుమూశారు. ఇక, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడు కూడా డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి రేస్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశానని, ఆ సమయంలో తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలను కలిశారు. తన పేరు పరిశీలించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన దేవరాపల్లి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు కూడా డీసీసీబీ పదవి ఆశిస్తున్నారు. ఈ ముగ్గురూ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. వీరు కాకుండా అనకాపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ కూడా డీసీసీబీ రేస్‌లో ఉన్నారు. ఇంకా మరికొందరు పార్టీ నాయకులు డీసీసీబీ, డీసీఎంఎస్‌ రేసులో ఉన్నారని, అయితే వారిలో కొందరు తమ పేర్లు బయట పెట్టకుండా ఎమ్మెల్యేలను కలవడంతోపాటు అధిష్ఠానాన్ని కలిశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి పదవులు ఒకే వర్గానికి కాకుండా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇస్తే సమతుల్యత పాటించినట్టు అవుతుందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. జిల్లాలో 98 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను నియమించనున్నందున గ్రామ స్థాయి నాయకుల పేర్లతో జాబితాలు రూపొందించే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. త్వరలో 98 సంఘాలకు సంబంధించిన జాబితాలను అధిష్ఠానానికి పంపనున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో నామినేటెడ్‌ పదవులు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:53 AM