ప్రాణాలు తీసిన దాగుడుమూతలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:29 AM
ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చింది. నగరంలోని ఓ హోటల్‌లో బస చేసింది.
ఆడుకుంటూ కిటికీ కర్టెన్ వెనుక దాక్కున్న ఐదేళ్ల బాలిక
అదుపుతప్పి హోటల్ నాలుగో అంతస్థు నుంచి పడి దుర్మరణం
వైజాగ్ నుంచి తీర్థయాత్రలకు వచ్చిన కుటుంబంలో విషాదం
విజయవాడ/గుణదల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబం విశాఖపట్నం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చింది. నగరంలోని ఓ హోటల్‌లో బస చేసింది. కొద్దిసేపట్లో దర్శనం చేసుకుని సొంతూరుకు బయల్దేరి వెళ్లాలి. ఈ హడావుడిలో తల్లిదండ్రులు బ్యాగులు సర్దుకుంటున్నారు. పిల్లలిద్దరూ దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. అన్నయ్యకు కనిపించకుండా ఐదేళ్ల చిన్నారి కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ఆ కిటికీ తలుపు బోల్టు తీసి ఉండడంతో అదుపుతప్పి నాలుగో అంతస్తు నుంచి జారి కిందపడింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ నగరంలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నాలుగో అంతస్తు నుంచి పడి
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదురు ఆఫీసర్స్ కాలనీలో మహారాణి పేటకు చెందిన వంకాయల బద్రీనాగరాజు, సాయిగీతకు 2015లో వివాహమైంది. వారికి జై అద్విక్, కుమార్తె రుహిక (5) సంతానం. దసరా తర్వాత దేవాలయాలు ఖాళీగా ఉంటాయని భావించి దర్శనాలు చేసుకోవడానికి ఈనెల 26న ఈ కుటుంబం విశాఖపట్నం నుంచి సొంత కారులో శ్రీశైలం బయల్దేరింది. శ్రీశైలం దర్శనం పూర్తయ్యాక మహానంది వెళ్లారు. ఆదివారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. వెటర్నరీ కాలనీలోని మినర్వా గ్రాండ్ హోటల్ రూమ్ నంబరు 406లో బస చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు కుటుంబం మొత్తం బయటకు వచ్చి టిఫిన్ చేసింది. ఆ తర్వాత అంతా రూమ్‌లోకి వెళ్లిపోయారు. భార్యాభర్తలిద్దరూ బ్యాగులు సర్దుతుండగా.. అద్విక్, రుహిక.. దొంగ పోలీస్ (దాడుగుమూతలు) ఆడుతున్నారు. రుహిక వెళ్లి ఆ గది కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ఆ సమయంలో కిటికీ తలుపు వేసి ఉన్నప్పటికీ దానికి పైన ఉండే గడియ పెట్టలేదు. కర్టెన్ అడ్డుగా పెట్టుకున్న రుహిక.. కాస్త వెనక్కు జరిగి కిటికీ తలుపునకు నడుమ వాల్చింది. బోల్టు పెట్టకపోవడంతో తలుపు ఒక్కసారిగా బయటకు వెళ్లడంతో అదుపుతప్పి నాలుగో అంతస్తు నుంచి కిందపడిపోయింది. నేరుగా కార్ పార్కింగ్ ఫ్లోర్‌పై పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమె పడిపోవడాన్ని ఇద్దరు హౌస్‌కీపర్లు బయట నుంచి గమనించారు. వారు పరుగెత్తుకుని వచ్చేలోపు బాలిక నేలపై పడిపోయింది.
తిరిగొచ్చి చూసేసరికి
ఆట మధ్యలో బాత్‌రూంకు వెళ్లిన అద్విక్ తిరిగొచ్చి చూసేసరికి చెల్లి కనిపించలేదు. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. వారు గది మొత్తం వెతికినా కనిపించకపోయే సరికి కిటికీలో నుంచి కిందకు చూశారు. అప్పటికే రుహిక రక్తపు మడుగులో ఉంది. వారు వెంటనే పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రుహిక ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరికాసేపట్లో ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. మాచవరం ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి:
Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు
Updated Date - Oct 29 , 2024 | 12:28 PM