హైవే నిర్మాణానికి మట్టి అక్రమ తవ్వకాలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:53 AM
జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం నేపథ్యంలో కాకరపాడు- పిట్టచలం గ్రామాల మధ్య అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రెవెన్యూ అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పాత రోడ్డు నుంచి 10 అడుగుల మేరకు మట్టి తవ్వేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
- 10 అడుగుల మేర పాత రహదారిని తవ్వి మట్టి తరలించిన కాంట్రాక్టర్
- అనుమతులు లేకుండా రెవెన్యూ పోరంబోకులో తవ్వకాలు
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న ఆ ప్రాంతవాసులు
కొయ్యూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం నేపథ్యంలో కాకరపాడు- పిట్టచలం గ్రామాల మధ్య అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రెవెన్యూ అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పాత రోడ్డు నుంచి 10 అడుగుల మేరకు మట్టి తవ్వేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలోని కాకరపాడు నుంచి చింతాలమ్మ ఘాట్ మీదుగా వలసంపేట, నడింపాలెం రొంపుల ఘాట్ మీదుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. రామరాజుపాలెం, పి.మాకవరం వద్ద నిర్మించిన వంతెనల అప్రోచ్ రోడ్డుకు అవసరమైన మట్టి కోసం కొండను తవ్వి వినియోగిస్తున్నారు. ఇది చాలకపోవడంతో కాకరపాడు-పిట్టచలం మధ్య అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. పిట్టచలం దాటాక రోడ్డు మలుపులలలను కుదించే దిశగా అర కిలోమీటరు మేర పాత రహదారిని మార్చి పక్క నుంచి నూతనంగా హైవే నిర్మించారు. అయితే పాత రహదారి మధ్యలో కొండవాగుపై ఉన్న వంతెనను ఆనుకుని నూతన రహదారి వరకు పది అడుగుల మేరకు తవ్వకాలు జరిపి మట్టిని తరలించారు. ఇది కాకుండా దీన్ని ఆనుకుని కొండవాగు పక్క ఉన్న ప్రభుత్వ రెవెన్యూ పోరంబోకులో గల మట్టి గుట్టలను తవ్వేశారు. దీని వల్ల భారీ వర్షాలు కురిస్తే పాత రోడ్డును తవ్విన ప్రాంతంలో నీరు నిలిచిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతవాసులు భయపడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణాలకు అవసరమయ్యే మట్టిని ప్రభుత్వ భూముల్లో తవ్వే అధికారం కాంట్రాక్టర్‌కు ఉన్నా ప్రమాదభరితంగా తవ్వకాలు జరపకూడదని వారంటున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ప్రమాదాలు నివారించేలా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:53 AM