పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:42 AM
గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో పనిచేసే సఫాయి కర్మచారి (పారిశుధ్య కార్మికులు)లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వవా అన్నారు.
ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలి
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డాక్టర్ పీపీ వవా
అనకాపల్లి టౌన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో పనిచేసే సఫాయి కర్మచారి (పారిశుధ్య కార్మికులు)లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వవా అన్నారు. శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సఫాయి కర్మచారిలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంకుల అధికారులు ప్రత్యేక మేళాలను ఏర్పాటు చేసి వారికి రుణాలు మంజూరు చేయాలని, ఇందుకోసం ఎటువంటి ష్యూరిటీలు అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువులు, కోళ్ల పెంపకం యూనిట్లు మంజూరు చేయవచ్చనన్నారు.
సఫాయి కర్మచారి కార్మికులు విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ఆయన చెప్పారు. విధి నిర్వహణకు సంబంధించి కార్మికులకు దుస్తులు, బూట్లు, గ్లౌజు, నూనె ఇతర వస్తులను విధిగా అందజేయాలన్నారు. హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేయించాలని, నిర్ణీత సమయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు అందించాలని, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ వై.సత్యనారాయణరావు, అదనపు ఎస్పీ దేవప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అఽధికారి కె.రాజేశ్వరి, డీపీవో ఆర్.శిరీషారాణి, డీఈఓ జి.అప్పారావునాయుడు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.వసంతరావు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ కమిషనర్లు ప్రసాదరాజు, సురేంద్ర, జీవీఎంసీ జోనల్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 12:42 AM