మన్యంపై మక్కువ
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:29 PM
గిరిజన ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మక్కువని చెప్పక తప్పదు. డిప్యూటీ సీఎంగా ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పర్యటించగా, శనివారం జిల్లాలోని అనంతగిరి మండలం రాచకిలం ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఆరేళ్ల క్రితమే ఏజెన్సీ దుస్థితిపై చలించిన జనసేనాని
తాగునీరు, రోడ్లు, ఉపాధి అంశాలు గుర్తింపు
డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కల్యాణ్
నేడు రోడ్ల శంకుస్థాపన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజన ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మక్కువని చెప్పక తప్పదు. డిప్యూటీ సీఎంగా ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పర్యటించగా, శనివారం జిల్లాలోని అనంతగిరి మండలం రాచకిలం ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా డుంబ్రిగుడ మండలంలో గిరిజనుల దీనస్థితిని స్వయంగా చూశానని ప్రస్తావిస్తారు. దీంతో ఆయనకు గిరిజన ప్రాంతమంటే మక్కువ అని స్పష్టమవుతోంది.
నాడు జనసేనానిగా.. నేడు డిప్యూటీ సీఎంగా...
జనసేన పార్టీ అధ్యక్షుడుగా 2018 జూన్ 5న పవన్‌కల్యాణ్ డుంబ్రిగుడ మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రక్షిత తాగునీరు అందుబాటులో లేదని, కలుషితమైన ఊటగెడ్డ నీటినే తాగుతున్నామని వాపోయారు. అలాగే వైద్యం, రవాణా సదుపాయాలు అందుబాటులో లేవని, ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసపోతున్నామని గిరిజనులు జనసేనాని దృష్టికి తెచ్చారు. గిరిజనుల సమస్యలను ఆసక్తిగా ఆలకించిన ఆయన వెంటనే వారితో కలిసి తాగునీటిని సేకరిస్తున్న ఊటగెడ్డకు వెళ్లి అక్కడ తాగునీటిని పరిశీలించారు. అలాగే గ్రామంలో చర్మవ్యాధులతో బాధపడుతున్న వారిని పరిశీలించారు. గిరిజనుల తరపున పాలకులతో ఈ సమస్యలపై పోరాడతానని పవన్‌కలాణ్‌్ అప్పట్లో ప్రకటించారు.
ఇదిలావుండగా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్ అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఏజెన్సీలో గిరిజనులకు రక్షిత తాగునీరు లేదు.. సరైన రోడ్లు లేవు.. ఉపాధి అంతంతమాత్రంగానే ఉన్నాయనే విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. ఆరేళ్ల క్రితం జనసేనానిగా తన పర్యటనలో తెలుసుకున్న అంశాలపై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు ప్రకటించడం పవన్ కల్యాణ్ నిబద్ధతకు నిదర్శనమని కూటమి వర్గాలు అంటున్నాయి. తాజాగా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం జరగాలని అమరావతిలో పీఆర్ అధికారులు, ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన సూచించారు. అలాగే శనివారం అనంతగిరి మండలంలో పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు డిప్యూటీ సీఎం హోదాలో ఆయనే వస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో పవన్‌కల్యాణ్ పర్యటనను ఏజెన్సీ వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
Updated Date - Dec 21 , 2024 | 09:16 AM