రియల్టర్ బరితెగింపు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:52 AM
మండల కేంద్రం పరవాడలో ఓ రియల్టర్ బరి తెగించాడు. ఏకంగా పంచాయతీకి చెందిన రక్షణగోడను ఎక్స్‌కవేటర్ సాయంతో రాత్రికి రాత్రే కూలదోయించి తన లేఅవుట్‌కు రహదారిని ఏర్పాటు చేసుకున్నాడు. పరవాడ సంతబయలు నుంచి సినిమాహాల్ జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఈ తతంగం జరిగింది.
- పంచాయతీకి చెందిన రక్షణ గోడ కూలదోసి లేఅవుట్‌కు దారి
- రాత్రికి రాత్రే పనులు
- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
- రియల్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
పరవాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం పరవాడలో ఓ రియల్టర్ బరి తెగించాడు. ఏకంగా పంచాయతీకి చెందిన రక్షణగోడను ఎక్స్‌కవేటర్ సాయంతో రాత్రికి రాత్రే కూలదోయించి తన లేఅవుట్‌కు రహదారిని ఏర్పాటు చేసుకున్నాడు. పరవాడ సంతబయలు నుంచి సినిమాహాల్ జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఈ తతంగం జరిగింది.
పరవాడ సంతబయలు నుంచి సినిమాహాల్ జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని వినాయకుడి గుడి సమీపంలో పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 137లో గెడ్డవాగు ఉండేది. కాలక్రమేణా అది డ్రైనేజీలా మారిపోయింది. వాగును ఆనుకొని కొన్నేళ్ల క్రితం పంచాయతీ అధికారులు రక్షణ గోడ నిర్మించారు. కాగా గోడను ఆనుకొని అవతల వైపు ఉన్న స్థలాన్ని పరవాడకు చెందిన ఓ రియల్టర్ ఇటీవల కొనుగోలు చేశారు. సదరు స్థలంలోకి వెళ్లాలంటే దారి లేదు. రక్షణ గోడ ముందు భాగాన్ని గతంలో బహిర్భూమిగా వినియోగించుకునేవారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పొదలను రియల్టర్ తొలగించేసి ఆ స్థలంలో నుంచి రక్షణ గోడను కొంత మేర ఎక్స్‌కవేటర్‌తో మంగళవారం రాత్రి కూలదోయించారు. వెనుక ఉన్న తన లేఅవుట్‌కు రహదారి ఏర్పాటులో భాగంగా పంచాయతీకి చెందిన కాలువను సైతం కప్పేశారు. దీంతో వాడుకనీరు వెళ్లే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వానికి చెందిన రక్షణ గోడను తొలగించినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. రక్షణ గోడకు ముందు వైపు వాగుకు చెందిన సుమారు 10 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా భవిష్యత్తులో సదరు రియల్టర్ ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసినట్టు ఇక్కడ జోరుగా ప్రచారం సాగుతోంది. పరవాడలోని ప్రధాన రహదారిని ఆనుకొని ప్రస్తుతం సెంటు భూమి రూ.15 లక్షల ధర పలుకుతోంది. ఈ లెక్కన రక్షణ గోడ ముందు ఉన్న స్థలం అక్షరాల రూ.కోటి 50 లక్షలు ఉంటుంది. ఈ స్థలం కోసమే రియల్టర్ రక్షణ గోడ అవతల వైపు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి రక్షణగోడ కూల్చివేసిన రియల్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే రక్షణగోడ ముందు ఉన్న ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరవాడ తహసీల్దార్ ఎస్‌వీ అంబేడ్కర్ దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకువెళ్లగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - Dec 26 , 2024 | 12:52 AM