రాజీనామా చేసిన వలంటీర్లు.. ఏజెంట్లుగా కూర్చోకుండా చూడండి
ABN, Publish Date - Apr 13 , 2024 | 04:41 AM
రాష్ట్రంలో రాజీనామా చేసిన వలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల....
కేంద్ర ఎన్నికల పరిశీలకుడు మిశ్రాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల వినతి
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజీనామా చేసిన వలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామమోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వలంటీర్లు రేపు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలో రామమోహన్ మిశ్రాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిబద్ధతతో పనిచేయాలని, రాగద్వేషాలకు అతీతంగా దృఢ వైఖరితో వ్యవహరించాలని మిశ్రాకు సూచించామన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ఎన్నికల ముందు కాదని, ఆ తరువాతే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓటింగ్ నిష్పత్తి ప్రకారం అవకాశాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలు కోరడం తగదు. వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని మా సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వారిని ఆ విధుల నుంచి తప్పించింది. ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కనీసం మే నెలలో అయినా 1, 2 తేదీలలోనే పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని రామమోహన్ మిశ్రాను కోరాం’’ అని ఎల్వీ పేర్కొన్నారు.
ఆదేశాలు పాటించాల్సిందే: నిమ్మగడ్డ
రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసి పదవులు అధిష్ఠించే నాయకులు రాజ్యాంగ సంస్థలైన కోర్టులు, ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను తు.చ. తప్పకుండా ఆచరించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున వారు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని రమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ‘‘ఏపీలో 40 మంది సలహాదారులు ఉన్నారు. వారిలో 13 మందికి కేబినెట్ హోదా ఉంది. జీతాలు తీసుకుంటున్నవారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదు. ఏ ఉద్యోగి అయినా అలా చేస్తే విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. అవే నిబంధనలు సలహాదారులకు కూడా వర్తిస్తాయి. రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరితే, వివరణ కోరామని చెప్పారు. దీనిపై మేం తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారి క్రియాశీలకంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలే తప్ప వివరణలు కోరడం సరైన విధానం కాదు. సలహాదారులపై కఠిన చర్యలు తీసుకోకుంటే మేం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తా’’మని స్పష్టంచేశారు.
Updated Date - Apr 13 , 2024 | 04:41 AM