ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:33 PM
జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరులో ట్రామా కేర్ సెంటర్‌కు ప్రతిపాదనలు
పాడేరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పోలీసు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో రహదారి భద్రతాపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటారు వాహన చట్టాలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు పార్కింగ్ చేస్తే రూ.500 జరిమానా వేయాలన్నారు. రోడ్లను ఆక్రమించి పలు దుకాణాలకు చెందిన యజమానులు తమ సామాన్లను పెట్టడానికి వీల్లేదన్నారు. అలాగే జనం జీపులపై వేలాడుతూ ప్రయాణించకుండా అవగాహన కల్పించాలని, లైసెన్స్, బీమా లేకుండా వాహనాలు నడిపితే జరిమానా వేయాలని, అవసరమైతే ఆయా వాహనాలు సీజ్ చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే వాహనాలు నడుపుతూ మృతి చెందిన వారి వివరాలపై ఆరా తీశారు. అలాగే ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అరకులోయ, అనంతగిరి మండలాల్లో ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. పాడేరులో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి ఎస్.లీలాప్రసాద్, ఎంవీఐ కె.వాసు, ఆర్‌టీసీ డీఎం టి.ఉమామహేశ్వర్ రెడ్డి, స్థానిక సీఐ దీనబందు, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ విశ్వామిత్ర, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 11:33 PM