Vizag MLC Election: కూటమి అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ!.. ఈ నెల 13తో ముగియనున్న నామినేషన్ల గడువు
ABN , Publish Date - Aug 12 , 2024 | 09:13 AM
ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైనప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైనప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇవాళ (సోమవారం) అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
కాగా కూటమి తరపున తెరపైకి బైరా దిలీప్ చక్రవర్తి పేరు వచ్చింది. మరోవైపు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేడు అభ్యర్థి పేరును టీడీపీ అధిష్థానం ప్రకటించే సూచనలు ఉన్నాయి.
రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
రేపటితో (మంగళవారం-13) ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిపోనుంది. దీంతో ఈ రోజు, రేపు నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీకి ఎదురుదెబ్బ..
ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుస్తామంటున్న వైసీపీకి భారీ షాక్ తగిలింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచ్‌లు వైసీపీకి షాకిచ్చారు. మునగపాక మండలం ఎంపీపీ మళ్ళ జయలక్ష్మి వైసీపీకి గుబ్ బై చెప్పి జనసేనలో (Janasena) చేరారు. వైస్ ఎంపీపీలు బోద లక్ష్మి, చిందాడ దేవిలు కూడా పార్టీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. మరోవైపు.. రాజుపేట సర్పంచ్ కెల్లాడిదేముళ్ళు, చెర్లోపాలెం గ్రామ ఉపసర్పంచ్ బోదా వెంకట శ్రీనివాసరావులు సైతం వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వీరందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలనలో ఇన్నాళ్లు ఉన్నందుకు సిగ్గు పడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు చెబుతున్నారు.