అడవి... అంతరిస్తోంది
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:28 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో అడవులు వేగంగా అంతరిస్తున్నాయి. 2021తో పోల్చితే 2023లో 116.07 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది.
ఉమ్మడి జిల్లాలో 116.07 చ.కి.మీ. తగ్గిన అటవీ విస్తీర్ణం
అల్లూరి జిల్లాలో అత్యధికంగా తగ్గుదల
అటవీ అగ్నిప్రమాదాల్లో దేశంలోనే ఈ జిల్లా రెండోస్థానం
అర్బన్‌లో అడవుల విస్తీర్ణంలో ఏపీలో విశాఖ ప్రథమం
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖ జిల్లాలో అడవులు వేగంగా అంతరిస్తున్నాయి. 2021తో పోల్చితే 2023లో 116.07 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. అందులో ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 101.69 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. రాష్ట్రంలో మొత్తం 138.66 చ.కి.మీ.ల మేర అడవులు తగ్గగా, వాటిలో 101 చ.కి.మీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అనకాపల్లి జిల్లాలో 9.62 చ.కి.మీ.లు, విశాఖపట్నంలో 4.72 చ.కి.మీ. వెరసి ఉమ్మడి జిల్లాలో 116.07 చ.కి.మీ. విస్తీర్ణం తగ్గినట్టు అటవీ నివేదిక -2023 (ఇండియా స్టేట్‌ఆఫ్ ఫారెస్టు రిపోర్టు) వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర అటవీ , పర్యావరణ మంత్రి భూపేందర యాదవ్ శనివారం విడుదల చశారు.
అడవుల విస్తీర్ణం, చెట్లు, ఇతర అంశాలను 2021తో పోల్చుతూ 2023లో చేపట్టిన సర్వే నివేదిక ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా విస్తీర్ణం 12,446.54 చ.కి.మీ.లు కాగా, అందులో అత్యంత దట్టమైన అడవులు 1,173.18 చ.కి.మీ.లు, మధ్యస్థాయి అడవులు 3,781.97, ఓపెన్ అడవులు 1,952.17 వెరసి 6,917.32 చ.కి.మీలు (55.58శాతం) విస్తరించి ఉన్నాయి. మరో 726.83 చ.కి.మీ.లు పొదలు, డొంకలతో నిండి ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి దేశంలో అటవీ విస్తీర్ణాన్ని ఫారెస్టు సర్వే విభాగం సర్వేచేస్తోంది. 2021 నివేదికతో పోల్చితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101.69 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. అనకాపల్లి జిల్లాలో 3,847.88 చ.కి.మీ. జిల్లా విస్తీర్ణం కాగా దాంట్లో దట్టమైన అడవులు లేవు. మధ్యస్థాయి అటవీ విస్తీర్ణం 155.02 చ.కి.మీ.లు, ఓపెన్ అడవులు 551.29చ.కి.మీ.లు వెరసి 706.31 (18.36శాతం) చ.కి.మీలు మేర విస్తీర్ణం ఉండగా, 2021తో పోల్చితే 9.62 చ.కి.మీ.లు తగ్గింది. విశాఖపట్నం జిల్లాలో 952.40 చ.కి.మీ. జిల్లా విస్తీర్ణం కాగా అత్యంత దట్టమైన అడవులు లేవు. మధ్యస్థాయి అడవులు 99.03, ఓపెన్ అటవీ విస్తీర్ణం 173.42 చ.కి.మీలు వెరసి 272.45 (28.61శాతం) చ.కి.మీ.లు విస్తీర్ణం ఉండగా 4.21 చ.కి.మీలు పొదలు, డొంకలతో కూడిన పచ్చదనం ఉంది. దీంట్లో 2021తో పోల్చితే 4.76 చ.కి.మీ.లు తగ్గింది.
జిల్లా భూభాగంలో అటవీ విస్తీర్ణంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలో 55.58 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. తరువాత నగరం ఎక్కువగా ఉన్న విశాఖ జిల్లా 28.61 శాతంతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అటవీశాఖ నమోదుచేసిన ప్రాంతాల్లో చెట్ల సాంద్రత తగ్గడం అంటే (దట్టమైన చెట్లు కొట్టి వ్యవసాయానికి మళ్లించడం) ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు పోడు వ్యవసాయం కోసం అడవులు నరికివేస్తున్నారు. మైదాన ప్రాంతంలోని పొలాల్లో సరుగుడు, మామిడి, టేకు, ఆయిల్‌పాం తోటలు పెంచుతారు. కోతకు వచ్చినవి నరికివేస్తుంటారు. పంట సరిగ్గా రానిమామిడి, జీడి తోటలు తొలగిస్తారు. ఈ సమయంలో అటవీశాఖ సర్వే చేసినప్పుడు శాటిలైట్ ఇమేజ్‌లో అక్కడ ఖాళీ భూములున్నట్టుగా నమోదవుతుంది. దీంతో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదవుతుంది. ఏటా కోట్ల మొక్కలు నాటినా అటవీ విస్తీర్ణం పెరగకపోవడం ఇప్పటికీ శేషప్రశ్నగా ఓ అధికారి వ్యాఖ్యానించారు.
అగ్నిప్రమాదాల్లో అల్లూరి రెండోస్థానం..
దేశంలోని అడవుల్లో పలుచోట్ల తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లా రెండోస్థానంలో ఉంది. తాజా నివేదిక మేరకు 2022 నవంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు 6,399 అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2022 నవంబరు నుంచి 2023 జూన్ వరకు 3,639 ప్రమాదాలు సంభవించాయి. అల్లూరి జిల్లాలో శీతాకాలం ముగిసిన తరువాత వాతావరణంలో మార్పుల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో 2022 నవంబరు నుంచి 2023 జూన్ వరకు 194 అగ్నిప్రమాదాలు సంభవించగా, 2023 నవంబరు నుంచి 2024 జూన్ వరకు 126కు తగ్గాయి. విశాఖ జిల్లాలో 2022 నవంబరు నుంచి 2023 జూన్ వరకు మూడు, 2023 నవంబరు నుంచి 2024 జూన్ వరకు నాలుగు ప్రమాదాలు సంభవించాయి.
అర్బన్‌లో విశాఖ ప్రథమ స్థానం
జిల్లాలో భీమిలి నుంచి అనకాపల్లి వరకు 615.53 చ.కి.మీ. విస్తీర్ణంతో విస్తరించిన విశాఖ నగరం జనసమ్మర్ధంగా ఉంటుంది. అటువంటి మహానగరంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. రాష్ట్రంలో ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్న పట్టణాలు/నగరాల్లో విశాఖపట్నం ప్రథమస్థానంలో ఉంది. నగరంలో 68.59 చ.కి.మీ. విస్తీర్ణంలో మధ్యస్థాయి అడవి ఉండగా ఓపెన్ ఫారెస్టు 114.10 చ.కి.మీ. మేర విస్తరించాయి. మొత్తం 182.69 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది. మొత్తంలో అటవీ విస్తీర్ణం 29.68 శాతంగా ఉంది. నగరంలో కంబాలకొండ ఒక్కటే 1400 హెక్టార్లలో విస్తరించింది. జూ, సింహాచలం కొండ, విశాఖ ఉక్కు టౌన్‌షిప్, ఆంధ్రవిశ్వవిద్యాలయం, పార్కుల్లో లక్షల చెట్లతో పచ్చదనం నిండి ఉంది. హుద్‌హుద్ తరువాత నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదగడంతో పచ్చదనం పరచుకుంది. వీటన్నింటిని కలిపి ఓపెన్ ఫారెస్టుగా గుర్తిస్తారు. అయినా నగరంలో కాలుష్యం, వేసవిలో వేడి తగ్గాలన్నా మరిన్ని మొక్కలు పెంచాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
Updated Date - Dec 23 , 2024 | 12:28 AM