విషాదం
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:10 AM
దైవదర్శనం కోసం కారులో ఒడిశా బయలుదేరినవారు... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా కూడలి వద్ద ప్రమాదం బారినపడ్డారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తె సహా ముగ్గురు మృతిచెందారు.
దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన తల్లీ, కుమార్తె మృతి
మరొకరు కూడా...
కంచిలి, డిసంబరు 24 (ఆంధ్రజ్యోతి):
ఒక్కగానొక్క కుమార్తెకు పాట్నా ఐఐటీలో సీటు రావడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా సోమవారం రాత్రి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత దైవదర్శనం కోసం కారులో ఒడిశా బయలుదేరినవారు... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా కూడలి వద్ద ప్రమాదం బారినపడ్డారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తె సహా ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ నగరంలోని సీతమ్మధారకు చెందిన ముత్తా వెంకటరంగ రాజేష్ గుప్తా కుమార్తె నేహా గుప్తా(18)కు పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. దీంతో రాజేష్, ఆయన భార్య లావణ్య (43), కుమార్తె నేహాగుప్తా, తల్లి సుబ్బలక్ష్మి, తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన రాజేష్‌గుప్తా తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు (49), మరదలు రాధిక సోమవారం రాత్రి బీచ్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. వీరంతా మొక్కు తీర్చుకునేందుకు మంగళవారం వేకువజామున ఐదు గంటలకు విశాఖపట్నం నుంచి కారులో ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లోని తరిణి మాత దేవాలయానికి బయలుదేరారు. వారి వాహనం ఉదయం తొమ్మిది గంటల సమయంలో కంచిలి మండలం చిన్న కొజ్జిరియా సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే లావణ్య మృతిచెందింది. మిగిలిన క్షతగాత్రులను స్థానికులు 108 వాహనం, హైవే అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో నేహా గుప్తా, సోమేశ్వరరావు మృతిచెందారు. రాధిక పరిస్థితి విషమంగా ఉండడంలో ఆమెను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవ్ చేస్తున్న రాజేష్ గుప్తాకు, అతని తల్లి సుబ్బలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల మృతదేహాలను చూస్తూ రాజేష్ రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. లావణ్య, నేహా గుప్తా, సోమేశ్వరరావుల మృతదేహాలను సోంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
Updated Date - Dec 25 , 2024 | 01:10 AM