మారని మందుబాబులు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:43 AM
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల ధోరణి మాత్రం మారడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వైనం
పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నా ఫలితం శూన్యం
ఈ ఏడాది ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 33,707 కేసులు నమోదు
రూ.11.05 కోట్లు జరిమానా విధించిన కోర్టు
258 మందికి జైలుశిక్ష
ఇంకా 11,587 కేసులు కోర్టులో పెండింగ్
మద్యంమత్తులో వాహనం నడిపి రూ.11.05 కోట్లు చెల్లించేశారు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులు
రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్న వైనం
నివారణకు విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనికీలు చేస్తున్న పోలీసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల ధోరణి మాత్రం మారడం లేదు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు జైలు శిక్ష విధిస్తున్నా సరే మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏటా సగటున 1,400 వరకూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యధిక ప్రమాదాలకు వాహన చోదకులు మద్యం సేవించి ఉండడమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా డ్రంకన్ డ్రైవ్ పేరుతో ఎక్కడికక్కడ బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకూ ఈ తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినట్టయితే మొదట్లో వాహనాలను సీజ్ చేసి, జరిమానా విధించేవారు. మరుసటిరోజు జరిమానా కడితే వాహనాన్ని విడుదల చేసేవారు. దీనివల్ల మందుబాబుల తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని పోలీసులు పంథా మార్చారు. జరిమానా విధించి వదిలేయకుండా కోర్టులో హాజరుపరచడం మొదలుపెట్టారు. కోర్టు విచారణ జరిపి మొదటిసారి పట్టుబడిన వారికి రూ.పది వేలు జరిమానా విధించడం, రెండోసారి అయితే జైలు శిక్ష విధించడం చేస్తోంది. దీనివల్ల మందుబాబుల తీరు మారుతుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ పోలీసులు 33,707 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. వాటిలో 22,120 కేసులను న్యాయస్థానాలు ఇప్పటికే పరిష్కరించాయి. నిందితులకు రూ.11.05 కోట్లు జరిమానా విధించాయి. ఈ కేసుల్లో 258 మందికి జైలు శిక్ష పడింది. ఇంకా 11,587 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతం చేస్తాం
సీపీ శంఖబ్రతబాగ్చి
మద్యం మనిషి నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మద్యం సేవించిన వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోతారు. అందుకే ప్రమాదాలు జరుగుతుంటాయి. గత ఆరు నెలలుగా తనిఖీలను ముమ్మరం చేశాం. పట్టుబడినవారు ఎంతటివారైనా, ఎవరు చెప్పినా విడిచిపెట్టకుండా కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నాం. దీనివల్ల రోడ్డు ప్రమాదాలతోపాటు మరణాల సంఖ్యను తగ్గించగలిగాం. మద్యం తాగి వాహనం నడిపితే క్రిమినల్ కేసులను ఎదుర్కొనాల్సి వస్తుందని అందరూ గుర్తించాలి. మద్యం సేవించిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి వాటిని బుక్ చేసుకోవడమో...కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోవడమో చేయాలి. నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తాం.
Updated Date - Dec 26 , 2024 | 12:43 AM