అనకాపల్లిలో రైతుబజార్ ఏర్పాటయ్యేనా?
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:52 PM
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో రైతుబజార్ ఏర్పాటు కలగానే మిగిలింది. దశాబ్దాలుగా రైతులు, వినియోగదారులు ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర అందక, వినియోగదారులకు ధరల భారం అధికం కావడంతో అవస్థలు తప్పడం లేదు.
ఎన్నో ఏళ్లుగా రైతులు, వినియోగదారుల ఎదురుచూపులు
స్థల సమస్యతో కొలిక్కిరాని వైనం
అనకాపల్లి టౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో రైతుబజార్ ఏర్పాటు కలగానే మిగిలింది. దశాబ్దాలుగా రైతులు, వినియోగదారులు ఎదురుచూస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర అందక, వినియోగదారులకు ధరల భారం అధికం కావడంతో అవస్థలు తప్పడం లేదు.
విశాఖ నగరంలో పలుచోట్ల రైతుబజార్లు ఉండడంతో అక్కడి ప్రజలకు కూరగాయలు నిర్ణీత ధరలకు లభిస్తుండడంతో పాటు రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఏళ్ల తరబడి అనకాపల్లిలో కూరగాయల మార్కెట్ ఉన్నప్పటికీ ఇక్కడ రైతులకు గాని, వినియోగదారులకు గాని ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతోంది. అనకాపల్లికి రైతుబజార్ మంజూరై రెండేళ్లు దాటినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అనకాపల్లిలోని గాంధీ మార్కెట్‌కు నిత్యం అనకాపల్లి, చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు పండించిన కూరగాయలను తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. అయితే స్థానిక వ్యాపారులు నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. మరో వైపు వినియోగదారులు అధిక ధరలకు చిరు వ్యాపారుల నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతుబజార్ ఏర్పాటైతే రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలను అమ్ముకోవచ్చు. దీని వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు వినియోగదారులకు మార్కెట్‌లో కన్నా తక్కువ రేటుకు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో రైతుబజార్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో కూరగాయ పంటలు సాగు చేసే రైతులతో పాటు పట్టణానికి చెందిన వినియోగదారులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుబజార్ ఏర్పాటుకు అప్పట్లో ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించారు. విజయవాడ నుంచి మార్కెటింగ్‌శాఖ అధికారులు అనకాపల్లికి వచ్చి రైతుబజార్‌కు అవసరమైన స్థలాల కోసం అన్వేషణ చేశారు. గాంధీమార్కెట్‌కు ఎదురుగా ఉన్న డీసీఎంఎస్ స్థలం పరిశీలించారు. అయితే ఆ స్థలాన్ని డీసీఎంఎస్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ తరువాత అరటి, కొబ్బరికాయల మార్కెట్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లికి రైతుబజారును మంజూరు చేస్తూ 2021 మార్చి 5వ తేదీన మార్కెటింగ్‌శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రైతుబజార్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ స్థల సమస్య కొలిక్కి రాకపోవడంతో రైతుబజార్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయినా రైతుబజార్ అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారి రవికుమార్ వివరణ కోరగా గతంలో అధికారులు అరటి, కొబ్బరికాయల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారని, ఆ స్థలం జీవీఎంసీది కావడంతో లేఖ రాసినట్టు చెప్పారు. జీవీఎంసీ ఆ స్థలాన్ని కేటాయించినట్టయితే రైతుబజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Updated Date - Dec 22 , 2024 | 11:52 PM