ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టరేట్‌కు సొంత గూడు సమకూరేనా?

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:52 PM

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నప్పటికీ కలెక్టరేట్‌కు నేటికీ సొంత గూడు సమకూరలేదు. వాస్తవానికి కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.99.9 కోట్లతో ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టరేట్‌ సముదాయం నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలం ఇదే

రూ.99.9 కోట్లతో ప్రతిపాదనలు

ఎన్నికల ముందు ఆమోదం తెలిపిన వైసీపీ ప్రభుత్వం

నేటికీ కార్యరూపం దాల్చని వైనం

రెండేళ్ల క్రితమే 15 ఎకరాల స్థలం కేటాయింపు

ప్రభుత్వం మారడంతో

అయోమయంలో కలెక్టరేట్‌ నిర్మాణ వ్యవహారం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నప్పటికీ కలెక్టరేట్‌కు నేటికీ సొంత గూడు సమకూరలేదు. వాస్తవానికి కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.99.9 కోట్లతో ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్‌ భవనాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలవుతాయా? లేదా ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తుందా? అనే దానిపై స్పష్టత కరువైంది. దీంతో కలెక్టరేట్‌కు సొంత గూడు ఎప్పటికి సమకూరుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు దాటింది..

రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. 2022 ఏప్రిల్‌ నెలలో ఐటీడీఏ, రెవెన్యూ డివిజన్‌ అయిన పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరిట పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటుచేశారు. దీంతో అప్పటివరకు గిరిజన యువతకు వివిధ వృత్తి నైపుణ్య శిక్షణలిచ్చే స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను కలెక్టరేట్‌కు కేటాయించారు. దీంతో అక్కడే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌వో, సర్వే విభాగం, జిల్లా ఖజానా కార్యాలయం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా ప్రజాసంబంధాలధికారి కార్యాలయాలను ఏర్పాటుచేశారు. అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో మరికొన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను ఏర్పాటుచేశారు. కలెక్టర్‌తో సహా మరో ఏడు శాఖల కార్యాలయాలను యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోనే ఏర్పాటు చేయడంతో వసతి సమస్యతో పాటు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.

అరకులోయ మార్గంలో 15 ఎకరాలు కేటాయింపు..

స్థానిక కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు 15 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కలెక్టరేట్‌ సముదాయాన్ని విశాలంగా నిర్మించాలని, అక్కడే జిల్లా పోలీసు కార్యాలయం ఉండాలనే నిబంధన ప్రభుత్వం విధించింది. దీంతో కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి అనువుగా ఉండేలా పాడేరు నుంచి అరకులోయ వెళ్లే జాతీయ రహదారిని అనుకుని ఉన్న పట్టుపరిశ్రమ శాఖకు చెందిన స్థలాన్ని అధికారులు గుర్తించారు. తొలుత చింతలవీధి పంచాయతీ పరిధిలోని నడిమివీధి కొండపై ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినప్పటికీ స్థలం చదునుగా లేకపోవడంతో అక్కడ విరమించుకున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన స్థలం పాడేరు నడిబొడ్డున వున్న అంబేడ్కర్‌ కూడలికి కేవలం కిలోమీటరన్నర దూరంలో జాతీయ రహదారికి పక్కనే కావడంతో దీనినే కలెక్టరేట్‌ నిర్మాణానికి అన్ని విధాలా బాగుంటుందని అధికారులు భావించారు. దీంతో ఆ 15 ఎకరాల స్థలాన్ని గుర్తించి, అక్కడే కలెక్టరేట్‌ సముదాయాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే రూ.100 కోట్లతో కలెక్టరేట్‌ సముదాయాన్ని నిర్మించేందుకు 2022లోనే జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.

ఎన్నికల ముందు ఆమోదం తెలిపిన వైసీపీ ప్రభుత్వం

కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణానికి అధికారులు 2022లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినప్పటికీ 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. సుమారు రెండేళ్లు దాని గురించి పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో రూ.99.9 కోట్ల వ్యయంతో కలెక్టరేట్‌ సముదాయాన్ని నిర్మించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తర్వాత ఈ నిర్మాణాల విషయం మరుగున పడింది.

ఉద్యోగుల నివాస గృహాలకు స్థలాల అన్వేషణ

జిల్లా కార్యాలయంలోని పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల కోసం నివాస గృహాలను నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు స్థలాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం పాడేరులో ఉన్న ప్రభుత్వ నివాస గృహాల్లో ఐటీడీఏ, ఇతర శాఖల ఉద్యోగులున్నారు. దీంతో కొత్తగా వచ్చిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు వసతి సమస్య ఏర్పడింది. ప్రభుత్వ పరంగా నివాసగృహాల నిర్మాణానికి పది ఎకరాలు అవసరమని భావించిన రెవెన్యూ అధికారులు ఈ మేరకు స్థలం కోసం అన్వేషిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:52 PM