ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Development అభివృద్ధే లక్ష్యంగా!

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:06 AM

Development as the Goal ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో అమలుచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది.

దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి (ఫైల్‌)

  • వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన జిల్లా గాడిలో..

  • సమస్యలు పరిష్కరిస్తూ .. హామీలు నెరవేరుస్తూ పాలన

  • గిరిజన, మైదాన ప్రాంతాల్లో మౌలిక వసతులకు పెద్దపీట

  • ప్రాధాన్య క్రమంలో పనులు.. బాగుపడుతున్న రహదారులు

  • మెరుగుపడుతున్న మౌలిక వసతులు.. జిల్లావాసుల్లో హర్షం

పార్వతీపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో అమలుచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది. ఆరు నెలల పాలనలో జిల్లాకు కొత్త వెలుగులను తీసుకొచ్చింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించి శివారు భుములకూ నీరందేలా చర్యలు తీసుకుంటోంది. గిరిశిఖర గ్రామాల్లో కంటైనర్‌ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజనులకు స్థానికంగానే వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రహదారుల నిర్మాణాలను సైతం శరవేగంగా చేపడుతోంది. పల్లెల ప్రగతికి చర్యలు తీసుకుంటోంది. తాగునీరు, రోడ్లు, కాలువలు తదితర వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. పెంచిన పింఛను సొమ్మును ప్రతినెలా ఒకటో తేదీకే లబ్ధిదారులకు అందిస్తుండగా.. సామాన్య , మధ్యతరగతి వర్గాలకు దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం కొత్తగా వసతిగృహాలు ఏర్పాటు చేసింది. టూరిజం అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన జిల్లాను కూటమి సర్కారు గాడిలో పెడుతోంది.

సీతంపేటలో గర్భిణుల వసతిగృహం ఏర్పాటు...

జిల్లాలో మాతా శిశుమరణాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. దీనిలో భాగంగా గిరిజన గర్భిణుల కోసం సీతంపేటలో నూతనంగా వసతిగృహాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గర్భిణుల్లో రక్తహీనత నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సకాలంలో గిరిజన గర్భిణులకు పౌష్టికాహారం, వైద్యసేవలు అందేలా చూసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గుమ్మలక్ష్మీపురం, సాలూరులో వసతిగృహాలను ఏర్పాటు చేశారు. తాజాగా సీతంపేటలోనూ ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యాటక అభివృద్ధి...

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా సీతంపేట మండలంలో ఆడలి వ్యూ పాయింట్‌, మెట్టుగూడ జలపాతం, గిరిజన మ్యూజియం తదితర వాటికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఐటీడీఏకు ఆదాయం బాగానే వస్తోంది. మరోవైపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

కొత్త బస్సులు..

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో కొత్తగా ఒక్క ఆర్టీసీ బస్సును కూడా ప్రారంభించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ బస్సులను నూతనంగా ప్రారంభించారు.

ఉచిత గ్యాస్‌ సిలిండర్లు..

సూపర్‌ సిక్స్‌ హామీలులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే ప్రజలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందించిన ఘనత కూటమికే దక్కుతుంది. దీపం పథకం-2 కింద ఇప్పటివరకు జిల్లాలో 1,18,620 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందించారు. వారిలో 1,16, 007 మంది ఖాతాల్లో సబ్సిడీ నగదు జమైంది. ఇందు కోసం ప్రభుత్వం సుమారు రూ.8.72కోట్లు చెల్లించింది.

పింఛన్‌దారుల్లో ఆనందం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ సొమ్మును పెంచడంతో పాటు గత నెలల బకాయిలను కలిపి అందించింది. వైసీపీ ప్రభుత్వం ఏటా రూ.250 పెంచుతూ ఐదేళ్ల కాలానికి రూ.3వేలు చొప్పున సామాజిక పింఛన్లు అందించింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.వెయ్యి పెంచి ఎన్టీఆర్‌ భరోసా కింద లబ్ధిదారులకు ప్రతినెలా రూ.4వేల చొప్పున పింఛన్‌ సొమ్ము అందిస్తోంది. పెంచిన పింఛన్‌ ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా రూ.పది వేలు, పూర్తిగా మంచం పట్టిన వారికి రూ.15 వేల చొప్పున అందిస్తున్నారు. దీంతో పింఛన్‌ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,41,307 మందికి వివిధ రకాల పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.58.95 కోట్లు చెల్లిస్తోంది.

గిరిజన గ్రామాలకు మహర్దశ

కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధానంగా గిరిపుత్రులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ మేరకు ఉపాధి హామీ నిధులతో పలు గిరిశిఖర గ్రామాలకు రోడ్లు మంజూరు చేసింది. ఇప్పటికే సాలూరు మండలంలో సిరివర తదితర గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు రూ.9 కోట్లు కేటాయించారు. ఆ పనులకు సంబంధించి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులు శిలాఫలకం ఆవిష్కరించారు. అదేవిధంగా సుమారు రూ.రెండు కోట్లతో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కాలువలు, రహదారులు, భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.

మొబైల్‌ కంటైనర్‌ ఆసుపత్రి...

గిరిజనులకు స్థానికంగానే వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు మండలం కరడవలసలో కంటైనర్‌ ఆసుపత్రిని ప్రారంభించింది. పార్వతీ పురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోనూ కంటైనర్‌ ఆసుపత్రుల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గిరిశిఖర గ్రామాల ప్రజలు అత్యవసర వేళల్లో ఇబ్బందులు పడకుండా ఫీడర్‌ అంబులెన్స్‌లను సైతం పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చారు.

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్‌...

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ సర్కారు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పునః ప్రారంభించి.. పేదల ఆకలి తీరుస్తోంది. రూ.5కే నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో అన్న క్యాంటీన్‌ పునఃప్రారంభమవగా, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి.

రుణపడి ఉంటా..

కూటమి ప్రభుత్వం అందిస్తున్న రూ.4వేల పింఛన్‌తో సంతోషంగా జీవిస్తున్నాను. కనీస అవసరాలన్నీ తీరుతున్నాయి. పింఛన్‌ సొమ్ముతో ఈ ఏడాది సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకుంటా. కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.

- కె.హైమవతి, పార్వతీపురం

==============================

ఖర్చులు తగ్గాయి..

కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం కింద అందించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను అందుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ చర్యలతో మా ఖర్చులు తగ్గాయి.

- ఎస్‌.శ్రీదేవి, పార్వతీపురం

Updated Date - Dec 28 , 2024 | 12:06 AM