Disappointed: విర్రవీగారు.. ఓడిపోయారు..
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:28 AM
Disappointed:రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని రెచ్చిపోతే, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ఆలోచనతో పాలన సాగిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెబుతారో గత ఎన్నికలే ఉదాహరణ.
- ప్రశ్నించేవారిపై కేసులు.. ఎదురు తిరిగితే దాడులు
- ఎన్నికల్లో ఘోర పరాజయం.. కూటమి క్లీన్‌స్వీప్
పార్వతీపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని రెచ్చిపోతే, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ఆలోచనతో పాలన సాగిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెబుతారో గత ఎన్నికలే ఉదాహరణ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. సమస్యలపై ఎవరు పోరాడినా, నిలదీసినా పోలీసు కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ బాధలను ప్రజలు ఐదేళ్ల పాటు మౌనంగా భరించారు. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సరైన సమయం కోసం వేచిచూశారు. అలాంటి రోజు ఎన్నికల రూపంలో వచ్చింది. వైసీపీ పాలనలో వారు పడిన కష్టాలను పోలింగ్ రోజున గుర్తు చేసుకుని కసితీరా ఓట్లు వేసి జగన్ సర్కారును అథఃపాతాళానికి తొక్కేశారు. కూటమి పార్టీలకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో అప్పటివరకు అధికార మదంతో విర్రవీగిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, వైసీపీ నేతలు మాత్రం ఇందుకు తాము మినహాయింపు అనే ధోరణిలో వ్యవహరించేవారు. 2024 ఎన్నికల్లో కూడా తమదే విజయం అన్నట్లు అహకారం ధోరణితో ప్రవర్తించేవారు. కానీ, ప్రజలు మాత్రం వారికి సరైన గుణపాఠం చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేలంతా ఓటమి..
గత ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటామని వైసీపీ నేతలు గొప్పలకుపోయారు. కానీ, ఈ స్థానాలన్నీ కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. సాలూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థినిగా బరిలో నిలిచిన గుమ్మిడి సంధ్యారాణి ఘన విజయాన్ని సాధించారు. వైసీపీ పాలనలో ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన పీడిక రాజన్నదొర ఐదోసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడదామని అనుకున్నారు. కానీ, సంధ్యారాణి చేతిలో ఓటమిపాలయ్యారు. ఘన విజయం సాధించిన సంధ్యారాణి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రిగా రెండు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, దశాబ్దాలుగా గిరిజన ప్రాంతాల్లో తిష్ఠవేసిన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత ఆమెకే దక్కుతుంది. కురుపాం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఆశించిన మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పా శ్రీవాణికి భంగపాటు తప్పలేదు. కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఎంపీటీసీ స్థాయి నుంచి వచ్చిన జగదీశ్వరి చేతిలో ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన పుష్పా శ్రీవాణి ఓడిపోయిన పరిస్థితి గత ఎన్నికల్లో జరిగింది. పాలకొండ నియోజకవర్గం నుంచి విశ్వసరాయి కళావతి వరుసగా రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి కూడా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడదామని అనుకున్నారు. కానీ, ప్రజలు మాత్రం కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు పట్టంకట్టారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ ప్రియ శిష్యుడిగా అలజంగి జోగారావు పేరొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, గత ఎన్నికల్లో మాత్రం రాజకీయాలకు కొత్తగా వచ్చిన కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అంతా 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయన్న నానుడి రుజువైంది.
నవరత్నాల పేరిట మోసం..
నవరత్నాల పేరిట గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పేది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. వైసీపీకి వ్యతిరే కంగా ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించకుండా ఏదో ఒక కారణంతో దూరం చేసేవారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకే ఎక్కువ ప్రయోజనం చేకూరింది. సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి లబ్ధి కలగలేదు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి తగిన చెప్పారు.
Updated Date - Dec 27 , 2024 | 12:28 AM