అడ్డంగా ‘బుక్’ అయ్యామా!
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:59 PM
జిల్లాలో ఉపాధి హామీ పథకం బేర్ ఫుట్ టెక్నీషియన్ల(బీఎఫ్‌టీలు) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎం.బుక్స్ నమోదు చేసిన వీరి నిర్వాహకానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించారన్న అభియోగం ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, ఏపీవోల మెడపై కత్తిలా వేలాడుతోంది. వారిపై చర్యలకూ రంగం సిద్ధమవుతోంది. జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా)లో ఇప్పుడిది కలకలం రేపుతోంది.
అడ్డంగా ‘బుక్’ అయ్యామా!
ఉపాధిలో ఎం.బుక్ నమోదు వ్యవహారంపై కదలిక
టెన్షన్ పడుతున్న బీఎఫ్‌టీలు, అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ప్రకంపనలు
ఆర్టీఐ కమిషనర్‌కు ఎమ్మార్పీఎస్ నేత లేఖ
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కదులుతున్న డొంక
మెంటాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఉపాధి హామీ పథకం బేర్ ఫుట్ టెక్నీషియన్ల(బీఎఫ్‌టీలు) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎం.బుక్స్ నమోదు చేసిన వీరి నిర్వాహకానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా సహకరించారన్న అభియోగం ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, ఏపీవోల మెడపై కత్తిలా వేలాడుతోంది. వారిపై చర్యలకూ రంగం సిద్ధమవుతోంది. జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా)లో ఇప్పుడిది కలకలం రేపుతోంది.
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో బీఎఫ్‌టీల అతిజోక్యంపై అక్టోబరు 28న ‘ఆంధ్రజ్యోతి’లో సమగ్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అర్హత లేకపోయినా ఎం.బుక్కులు నమోదుచేస్తున్న సంగతిని అందులో స్పష్టం చేసింది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో రామభద్రపురం మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పింకి సుధాకర్....బీఎఫ్‌టీల అర్హత లు, విధుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతూ నవంబరు 8న కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దాన్ని డ్వామాకు బదిలీ చేసినప్పటికీ అట్నుంచి సమాచారం రాలేదు. దీంతో తాడేపల్లి(గుంటూరు)లోని ఆర్టీఐ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో అట్నుంచి అందిన సమాచారంతో అనేక కీలక విషయాలు వెలుగు చూశాయి.
2005 నుంచి ఉపాధి హామీ పథకంలో బీఎస్సీలో మేథ్స్ / సైన్స్ లో ఉత్తీర్ణులై, రోస్టర్, రిజర్వేషన్‌లో ప్రభుత్వం నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే ఎం.బుక్ నమోదుకు అర్హులని అందులో పేర్కొన్నారు. అయితే టెన్త్ పాసై, మేట్‌గా పనిచేసేవారిని బీఎఫ్‌టీలుగా ఎంపిక చేస్తూ వస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. పదో తరగతి పాసైన బీఎఫ్‌టీలు జిల్లాలోని దత్తిరాజేరు, మెరకముడిదాం, సంతకవిటి, గరివిడి, బాడంగి, ఎస్.కోట,మెంటాడ మండలాల్లో పనిచేస్తున్నారని తెలియవచ్చింది. వీరు టైమ్ లీ మెజర్మెంట్స్‌లో టెక్నికల్ అసిస్టెంట్లకు సహాయకారిగా ఉండడం తప్ప ఎం బుక్ నమోదుకు వీరికి ఎటువంటి ఉత్తర్వులు లేవని కమిషనర్ కార్యాలయం నుంచి అందిన సమాచారంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఎనిమిది మండలాల్లోని బీఎఫ్‌టీలపై ఏ చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నకు సంబంధించిన సమాచారం తమవద్ద అందుబాటులో లేదని, డ్వామా కార్యాలయం నుంచి పొందవచ్చునని కమిషనర్ కార్యాలయం దరఖాస్తుదారుకు సూచించింది. తాజా పరిణామం నేపథ్యంలో ఆ ఎనిమిది మండలాల్లోని బీఎఫ్‌టీల విషయమై జిల్లా అధికారులు స్పందించా ల్సి ఉంది. చర్యలు తీసుకుంటే తమతోపాటు ఎంపీడీవోలు, ఏపీవోలపై కూడా చర్యలు ఉండాల్సిందేనన్న వాదన బీఎఫ్‌టీల నుంచి వినిపిస్తోంది. వారి సూచన మేరకే తాము ఎం బుక్కులు నమోదు చేశామని, వాటిపై వారు అటెస్టేషన్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఫ ఈ బాగోతమంతా గత వైసీపీ ఏలుబడిలో విచ్చలవిడిగా నడిచింది. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను బేఖాతరు చేసి ఇప్పుడు అనవసరంగా చిక్కుల్లో పడ్డామా అని కొందరు ఎంపీడీవోలు, ఏపీవోలు వాపోతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకంపనలు సృష్టించిదనే చెప్పాలి. ఇదే విషయమై డ్వామా పీడీ కళ్యాణ్ చక్రవర్తిని వివరణ కోరగా టెక్నికల్ అసిస్టెంట్‌లు సరిపడని చోట బీఎఫ్‌టీలను నియమించామన్నారు. ఎం.బుక్ రికార్డు నమోదు విషయం కొత్త గైడ్‌లైన్స్ చూసి చెప్పాలని, ప్రస్తుతం కార్యాలయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:00 AM