గిరిజన గ్రామాలకు మహర్దశ
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:15 PM
గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా కనీస అభివృద్ధికి నోచని గిరిజన ప్రాంతాలకు మంచిరోజులొచ్చాయి. కూటమి ప్రభుత్వం చర్యలతో కొత్త రూపును సంతరించుకోనున్నాయి. గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల ప్రగతికి భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
డోలీల మోతలు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం
కంటైనర్ ఆసుపత్రుల ద్వారా స్థానికంగానే వైద్యసేవలు
అందుబాటులోకి ఫీడర్ అంబులెన్స్‌లు
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల మంజూరు
గిరిజన గర్భిణుల కోసం వసతిగృహాల ఏర్పాటు
గత వైసీపీ సర్కారు పాలనలో నిర్లక్ష్యానికి గురైన గిరిజన గ్రామాలు
కూటమి చర్యలతో శరవేగంగా అభివృద్ధి పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న ‘మన్యం’ వాసులు
పార్వతీపురం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా కనీస అభివృద్ధికి నోచని గిరిజన ప్రాంతాలకు మంచిరోజులొచ్చాయి. కూటమి ప్రభుత్వం చర్యలతో కొత్త రూపును సంతరించుకోనున్నాయి. గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల ప్రగతికి భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. డోలీ మోతలు తప్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొండ శిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రెండేళ్లలో వాటి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కంటైనర్ ఆసుపత్రుల ద్వారా గిరిపుత్రులకు స్థానికంగా వైద్య సేవలు అందిస్తోంది. తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా నిధులు మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది నెలల్లోనే గిరిజన గ్రామాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- సాలూరు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి మంత్రి సంధ్యారాణి కృషితో రూ.మూడు కోట్లపైన నిధులు మంజూరయ్యాయి.కాగా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూలకు చేరిన ఫీడర్ అంబులెన్స్‌లను సైతం వినియోగంలోకి తెచ్చారు. దీంతో అత్యవసర వేళల్లో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందగలుగుతున్నారు.
- గత ఐదేళ్లలో గిరిజనులకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో మృతదేహాలతో ఐటీడీఏల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఈ మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి మహాప్రస్థానం పేరిట అంబులెన్స్‌ను సమకూర్చింది. దీంతో గిరిజనుల ఇబ్బందులు తొలిగాయి.
- కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు విషయంలో మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కృషి ఫలించింది. ఈ మేరకు రాష్ట్రంలో తొలిసారిగా సాలూరు మండలం కరడవలస గిరిశిఖర గ్రామంలో ఏర్పాటైన కంటైనర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది గిరిజనులు వైద్య సేవలు పొందుతున్నారు.
- పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవతో సీతంపేట మండలంలో గిరిజన గర్భిణుల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏజెన్సీలో గర్భిణులకు సకాలంలో పౌష్టికాహారం , వైద్యసేవలు అందుతున్నాయి.
- కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రయత్నిస్తున్నారు.
రహదారుల నిర్మాణాలకు నిధులు..
- జిల్లాలో సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో గిరిశిఖర గ్రామమైన బాగుజోల నుంచి సాలూరు మండలం సిరివర వరకు బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ పనులను సంబంధించి ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 9.50 కోట్లతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చిలకమెండండి, బందమెండంగి, తాటిపుట్టి, డొయివర, సిరివర, పొయిమాల గిరిశిఖర గ్రామాల గిరిజనులకు డోలీ మోతలు, పంట రవాణా తదితర ఇబ్బందులు తప్పుతాయి.
- పాచిపెంట మండలంలో ఆలూరు-రిట్లపాడు బీటీ రహదారి నిర్మాణానికి రూ.నాలుగు కోట్లు, గుమ్మలక్ష్మీపురం మండలంలో పాములగీశాడ-మంత్రజ్వాల రోడ్డు కోసం రూ. 3.60 కోట్లను మంజూరు చేశారు. త్వరలోనే ఆయా గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు జరగనున్నాయి.
- మరోవైపు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో నాలుగు నియోజకవర్గాల్లో గిరిజన గ్రామాల్లో రహదారులు నిర్మిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
ఐటీడీఏల పరిధిలో..
సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో వందకు మించి జనాభా ఉన్న గ్రామాలు 505 వరకూ ఉన్నాయి. వందలోపు జనాభా ఉన్న పీవీటీజీ గ్రామాలు 352 ఉన్నాయి. నాన్ పీవీటీజీలు 1,492 ఉన్నాయి. మొత్తంగా రెండు ఐటీడీఏల పరిధిలో 1,785 గ్రామాలకు రహదారులు ఉన్నాయి. మిగిలిన 539 గిరిజన గ్రామాల్లో రెండేళ్లలో పక్కా రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. దశాబ్దాలుగా రహదారులు లేని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. రాష్ట్రంలో తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రి నిర్మాణం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు.
- గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
======================================
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. డోలీల మోతలను తప్పించాలనే ఉద్దేశంతో ప్రతి గిరిజన గ్రామానికి రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా రెండేళ్లలో ప్రతి గిరిజన గ్రామంలో రహదారుల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. ఇప్పటికే ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులతో నాలుగు నియోజకవర్గాల్లో రహదారుల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
- శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం
Updated Date - Dec 22 , 2024 | 11:15 PM