hope ఆశ వదులుకోవాల్సిందేనా?
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:38 AM
Should I give up hope? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏ పొలంలో చూసినా నీరే కనిపిస్తోంది. వరి పంట కుప్పలుగా పేర్చినప్పటికీ కొంచెం కొంచెం నీరు చేరి వరి కంకెలకు మొలకలు వచ్చేస్తున్నాయి.
ఆశ వదులుకోవాల్సిందేనా?
మెలకెత్తుతున్న వరి కంకులు
నేటికీ వరద నీటిలో పెసర, మినప మొక్కలు
వరుస తుఫాన్లతో పంటలకు నష్టం
శృంగవరపుకోట, డిసెంబర్ 24 (ఆంధ్రజ్యోతి):
- శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో మొలకెత్తిన వరి కంకులవి. నాలుగు ఎకరాల్లో వేసిన వరి పంటకు వారం రోజుల క్రితం కోతలు చేపట్టాడు. నూర్పు పట్టాలని అనుకుంటున్నంతలోనే తుఫాన్ హెచ్చరిక వినిపించింది. వెంటనే వ్యవసాయ అధికారుల సూచనతో పొలంలో కుప్పలేశాడు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిచి మెలకెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ధాన్యం తీసుకుంటాయో లేదోనని రైతు టెన్షన్ పడుతున్నాడు.
- వేపాడ మండలం బొద్దాం పంచాయతీ శివారు కొత్తబొద్దాం గ్రామ సమీపంలోని పొలాల్లో ఏపుగా పెరిగిన పెసర, మినప మొక్కలవి. పక్కపక్క పొలంలో పోటీపడి పెరిగాయి. తుఫాన్ వర్షాలకు నీట మునిగాయి. నీటిని బయటకు పంపించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నప్పటికీ రోజూ పడుతున్న వర్షంతో పైపొలాల నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏ పొలంలో చూసినా నీరే కనిపిస్తోంది. వరి పంట కుప్పలుగా పేర్చినప్పటికీ కొంచెం కొంచెం నీరు చేరి వరి కంకెలకు మొలకలు వచ్చేస్తున్నాయి. మరోవైపు పెసర, మినప మెక్కలు నీట మునిగాయి. చాలా మొక్కలు చనిపోతున్నాయి. వరితో లాభం ఎక్కువగా లేకపోయినా పెసర, మినప పంటలతో కాస్త ధీమాగా ఉండొచ్చునని రైతులు భావించారు. ఏ రకంగా కూడా కలిసి రావడం లేదు. వరి పంటకు ముందు నువ్వుపంట, వెనక పెసర, మినప బాగా పండితేనే రైతుకు ఊరట. నువ్వు పంట చేతికి వచ్చే సమయానికి ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో పంట ఇంటికి చేరడం అనుమానమే. పెసర, మినప పంట అలా కాదు. వరి కోతల సమయంలో తడిన్న పొలంలో నాటితే చాలు మొలక వస్తుంది. ఆ తరువాత నీటితో పనిలేదు. పంట చేతికిరావడం ఖాయం. అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలు వరి పంటతో పాటు పెసర, మినప పంటకు నష్టం తెస్తున్నాయి.
ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 97,397 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. వర్షాలు సక్రమంగా పడక ముందు, వెనక ఉబాలు జరిగాయి. అయినప్పటికీ ఆశాజనకంగా పంట పండింది. దీంతో రైతు సంబర పడ్డాడు. నవంబరు నెలాఖరు నుంచి వరి కోతలు చేపట్టాడు. అప్పుడే తుఫాన్‌లు కూడా మొదలయ్యాయి. దీంతో కోతలను ఆపేసి, పూర్తయిన కంకెలను కుప్పలుగా పెట్టారు. ఆ తర్వాత నూర్పు చేపట్టి సొంతానికి కొంత ధాన్యం వుంచుకుని మిగిలిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. కూటమి ప్రభుత్వం కూడా అమ్మిన ధాన్యానికి రెండు మూడు రోజుల్లోనే చెల్లింపులు చేసేస్తున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో రెండు వారాలుగా వరస తుఫాన్‌లు వస్తున్నాయి. ఇంకా సగం పంట పొలంలో వుంది. కొన్ని ప్రాంతాల్లో వరి కుప్పలు నానడంతో మెలకలు వస్తున్నాయి. వీటి పరిస్థితి ఇలా వుంటే పెసలు, మినములు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు.
ఫ వరి కోతలకు రెండు రోజుల ముందు పెసలు, మినుమల విత్తనాలు చల్లారు. వ్యవసాయ శాఖ 4081 హెక్టార్లలో పెసలు, 10067 హెక్టార్లలో మినుమ విత్తనాలు వేసినట్లు చెబుతోంది. వరి పంట వున్న ప్రతి పొలంలోను ఈ పంటలు పండిస్తారు. వరి ద్వారా పొందని ఆదాయాన్ని పెసర, మినప పంటల ద్వారా ఆశిస్తారు. కానీ వర్షాలకు నేడు దిగాలు చెందుతున్నారు.
నీటిలోనే వరి
భోగాపురం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పంట పొలాల్లో చేరిన వరదనీరు తగ్గడం లేదు. చిరు జల్లులు కొనసాగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భోగాపురం మండలంలోని రాజాపులోవ, చెరుకుపల్లి, పోలిపల్లి, లింగాలవలస ప్రాంతాల్లో పంట పొలాలను వరద నీరు వీడడం లేదు.
Updated Date - Dec 25 , 2024 | 12:38 AM