Solve survey problems; సర్వే సమస్యలను గ్రామస్థుల సమక్షంలోనే పరిష్కరించండి
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:16 AM
Solve survey problems; జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో గ్రామస్థులు, రైతుల సమక్షంలోనే సర్వే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
పార్వతీపురం రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో గ్రామస్థులు, రైతుల సమక్షంలోనే సర్వే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. పలువురు రైతులు రీ సర్వేలో భూముల సబ్ డివిజన్ అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన ల్యాండ్ మ్యాప్‌ల ఆధారంగా రైతుల భూ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యకు నాణమైన పరిష్కారాన్ని చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, తహసీల్దార్, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
పార్వతీపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడ్‌ల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడుల్లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తారని, వీరికి పింఛన్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి 2025 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో కొచ్చిలో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉంటుందని వివరించారు. నోటిఫికేషన్ వివరాలు ఏఐఆర్‌ఎం ఈఎన్‌ఎస్‌ఈఎల్‌ఈసీటీఐఓఎన్.సీడీఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో యువత రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.
Updated Date - Dec 27 , 2024 | 12:16 AM