వీడని వాన.. అన్నదాతల్లో ఆందోళన
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:20 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలావరకు రైతులు వరి నూర్పులు పూర్తి చేసుకోగా, కొందరు ఇంకా పూర్తి చేసుకోలేకపోయారు. వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందనుకన్న పంట.. పొలాల్లోనే తడిచి ముద్దయిపోతోంది. పలు చోట్ల నూర్పులు పూర్తయిన ధాన్యం మిల్లులకు చేరక రైతులు అల్లాడుతు న్నారు. పొలాల్లోనే వరి పంటను కుప్పలుగా వేసి ఉంచారు. వర్షపు నీరు వాటిపైనే పడడంతో ధాన్యం రంగుమారి కొన్ని చోట్ల మొలకలు కూడా వస్తున్నాయి. అలాగే అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, టమాటా తదితర పంటలు నీటిలో ఉండడంతో కుళ్లిపోయి అపార నష్టం వాటిల్లితోంది.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఇలా..
పార్వతీపురం, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలోని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం నిల్వలు 105 మీటర్లు ఉండాల్సి ఉండగా 49 మీటర్లు నీటి నిల్వలు ఉన్నాయి. వీఆర్‌ఎస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 161 మీటర్లు ఉండాల్సి ఉండగా తాజా 16.0.4 మీటర్లు నీటినిల్వలు ఉన్నాయి. ఒట్టిగెడ్డ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 121.62 మీటర్లు ఉండాల్సి ఉండగా 111.31మీటర్లు నీటినిల్వలు ఉన్నాయి. పెద్దగెడ్డ రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 213.80 కాగా 211.54 మీటర్లు నీటిమట్టం నమోదయ్యింది. కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టాల నిల్వ మరింత పెరిగే అవకాశం ఉంది.
Updated Date - Dec 26 , 2024 | 12:20 AM